అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad Ganesh | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఖైరతాబాద్ మహా గణపతి ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ఈ ఏడాది కూడా హంగులతో గణనాథుడు కొలువయ్యాడు. ఈ క్రమంలో ఎంతో ఉత్సాహంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నిన్న ఆదివారం కావడంతో ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. దాంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా శనివారం రాత్రి నుంచే ప్రత్యేక రూట్‌మ్యాప్ అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండడంతో గణేశ్ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందనే సందేహం భక్తుల్లో ఏర్పడింది.
Khairatabad Ganesh | ఒక్క రోజే 5 లక్షల మంది..
అయితే ఈ అనుమానాలకు తెరదిస్తూ, ఉత్సవ కమిటీ సెప్టెంబర్ 6నే నిమజ్జనం(September 6th Immersion) జరపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో భక్తులలో సంతృప్తి నెలకొంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఈ నిమజ్జన మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. GHMC, పోలీసులు, ఇతర విభాగాలు కలిసి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనానికి క్రేన్‌లు, బ్యారికేడ్లు సిద్ధం చేశారు. రహదారుల మరమ్మతులు, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ వంటి విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక ఖైరతాబాద్ గణపతి (Khairatabad Ganapati) మరో మరో ఐదు రోజులలో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ క్రమంలో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం అర్ధరాత్రి వరకు దాదాపు 5లక్షల మంది భక్తులు హాజరైనట్టు తెలుస్తోంది. పలువురు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్‌కు రాగా, అది పూర్తయిన తర్వాత ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఉత్సవ సమితి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసింది. కాగా.. ఖైరతాబాద్ గణేశ్ ప్రతిష్ట 1954లో 5 అడుగుల విగ్రహంతో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఒక అడుగు చొప్పున విగ్రహ ఎత్తు పెంచుతూ వచ్చారు. 2014లో గరిష్ఠంగా 60 అడుగులు చేరుకోగా, భద్రతా కారణాల వల్ల తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఎత్తు తగ్గించారు. ఈ ఏడాది 69 అడుగుల ‘విశ్వశాంతి మహా గణపతి’ (Vishwashanthi Maha Ganapathi) రూపంలో విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది.