అక్షరటుడే, వెబ్‌డెస్క్:Krishna Express | కృష్ణా ఎక్స్ప్రెస్లో స్లీపర్ బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల బోగీల సంఖ్యలను మార్చాలని రైల్వేశాఖ (Railway Department) నిర్ణయించింది. ఇందులో భాగంగా సెకండ్ క్లాస్(Second class) చైర్కార్ బోగీలను తగ్గించి స్లీపర్ బోగీలను పెంచనుంది.
కృష్ణా ఎక్స్‌ప్రెస్(17405/17406) ఆదిలాబాద్– తిరుపతి మధ్య నిత్యం నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చాలా మంది ఈ రైలు ద్వారానే తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్తారు. ఈ ట్రైన్లో ప్రస్తుతం స్లీపర్ బోగీలు(Sleeper Coaches) నాలుగు, త్రీటైర్ ఏసీ నాలుగు, సెకండ్ క్లాస్ చైర్ కార్ 10, జనరల్ సెకండ్ క్లాస్ నాలుగు బోగీలున్నాయి. ఈ నెల 6 నుంచి త్రీటైర్ ఏసీ బోగీల్లో ఒకటి, సెకండ్ క్లాస్ చైర్కార్ బోగీల్లో నాలుగు తగ్గించనున్నారు.
దీంతో త్రీటైర్ ఏసీ మూడు, సెకండ్ క్లాస్ చైర్కార్ ఆరు బోగీలు అందుబాటులో ఉంటాయి. స్లీపర్ బోగీల సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరగనుంది. సెప్టెంబరు 1 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. సెప్టెంబరు 2 నుంచి జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు నాలుగుకు తగ్గి స్లీపర్ బోగీల సంఖ్య 14కు పెరగనుంది. ఆదిలాబాద్-హెచ్ఎస్ నాందేడ్ మధ్య నడి చే రైల్లో కూడా మార్పులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Krishna Express | 1974లో ప్రారంభం
కృష్ణా ఎక్స్‌ప్రెస్ (Krishna Express train) 1974లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు అందిస్తునే ఉంది. కాలనుగుణంగా మార్పులు చెందుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. మొదట ఇది సికింద్రాబాద్ నుంచి విజయవాడ(Secunderabad to Vijayawada) వరకు నడిచింది. తెలంగాణ–ఆంధ్ర మధ్య కృష్ణా నది వారధిగా ఉండడంతో దీనిని కృష్ణా ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు.
అనంతరం ఈ రైలును విజయవాడ నుంచి గుంటూరు వరకు పొడిగించారు. తర్వాత స్టేషన్లను పొడిగిస్తూ ప్రస్తుతం తిరుపతి వరకు నడుపుతున్నారు. మరోవైపు తెలంగాణలో సైతం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ (Secunderabad to Nizamabad) మీదుగా ఆదిలాబాద్ వరకు ఈ రైలును పొడిగించారు.