అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సమయంలో ఓటర్లు సమర్పించే 11 పత్రాలలో ఆధార్ కార్డును కూడా సంఘం అంగీకరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీహార్(Bihar)లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision) సందర్భంగా ఓటర్ జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను చూసి ఆందోళన వ్యక్తం చేసింది.
విచారణ సందర్భంగా రాజకీయ పార్టీల నిష్క్రియాత్మకతపై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ (Supreme Court Justice Suryakanth) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించిన తర్వాత వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన బీఎల్ఏలు నిష్క్రియంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకుండే బీఎల్ఏలకు (BLA) గ్రామాల్లోని దాదాపు అందరూ తెలిసి ఉంటారని పేర్కొన్నారు. ఎవరు స్థానికులు, ఎవరు వలసదారులన్న విషయం వారికి అవగాహన ఉంటుందని తెలిపారు.
నోటీసులు పౌరులు తమ ఆధార్ కార్డు కాపీతో (Aadhar Card Copy) పాటు జాబితాలో చేర్చడానికి క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చని స్పష్టంగా తెలియజేయాలని కూడా బెంచ్ కోరింది. బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో ఏకీకృత రాష్ట్ర స్థాయి జాబితాను కూడా అందుబాటులో ఉంచాలి. “అర్హత కలిగిన ఏ ఓటరు కూడా సహాయం లేకుండా ఉండకూడదనేది దీని ఉద్దేశ్యం” అని పర్యవేక్షణ కోసం ఈ విషయాన్ని పరిష్కరిస్తూ ధర్మాసనం పేర్కొంది.