అక్షరటుడే, కామారెడ్డి: Sadashiv nagar | క్షణికావేశం ఓ మహిళ ప్రాణాలను తీసింది. దంపతుల మధ్య జరిగిన చిన్నగొడవలో కోపోద్రిక్తుడైన భర్త భార్యపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సదాశివనగర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో (Jyothi nagar) చిందం లక్ష్మి – రవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సురేష్, మహేష్ ఉన్నారు. సురేష్ హైదరాబాద్లో (Hyderabad) పని చేస్తుండగా మహేష్ బతుకుదెరువు కోసం దుబాయ్ (Dubai) వెళ్లాడు. అయితే శుక్రవారం రాత్రి రవి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
భార్య వంట చేస్తుండగా దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కోపంతో భార్య భర్తను కొట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రవి ‘నన్నే కొడతావా’ అంటూ సమీపంలో ఉన్న రాయితో భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
