అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan | పాకిస్థాన్ రాజకీయాలు మరోసారి సంచలనానికి తెరలేపాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Former PM Imran Khan) కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన మేనల్లుడు షహ్రీజ్ ఖాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
ఈ ఘటన పాక్‌లోని రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. లాహోర్‌లోని స్వగృహంలో ఉన్న షహ్రీజ్‌ను, సాధారణ దుస్తుల్లో ఉన్న కొంతమంది దుండగులు బలవంతంగా ఇంట్లోకి చొచ్చుకువచ్చి, ఆయన పిల్లల కళ్లముందే హింసించి తీసుకెళ్లినట్లు పీటీఐ పార్టీ న్యాయవాది రాణా ముదస్సార్ ఉమర్ (Rana Mudassar Umar) తెలిపారు. సిబ్బందిపై దాడి చేసి, ఇంట్లో హంగామా సృష్టించి, బలవంతంగా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.
Pakistan | రాజకీయ లింక్ లేదన్న వాదనలు
ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ కుమారుడైన షహ్రీజ్, ప్రస్తుతం రాజకీయాల్లో లేడని, అతనిపై ఒక్క కేసూ నమోదు కాలేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ లినెన్ కంపెనీ(Linen Company)కి ప్రాంతీయ ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన, ఇటీవల తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లే యత్నంలో లాహోర్ విమానాశ్రయం(Lahore Airport)లో అధికారులచే అడ్డుకోవడం, తర్వాత ఈ కిడ్నాప్ జరగడం, ఈ ఘటనపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.
షహ్రీజ్ ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలి, ఇది ఒక సామాన్య పౌరుడిపై దాడి కాదు, ప్రజాస్వామ్యంపై దాడి అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాగా ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తరచూ సైన్యం, అధికార యంత్రాంగంపై విమర్శలు చేయడం, ఈ ఘటనకు నేపథ్యంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అడియాలా జైలు(Adiala Jail)లో ఉన్నారు. పలు కేసుల్లో బెయిల్ వచ్చినా, మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆయన విడుదల కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధించడం జరుగుతోందని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటనతో పాకిస్తాన్(Pakistan)లో ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణపై మళ్లీ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వ్యతిరేకులను భయపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అనే అనుమానాలకు ఇది దారితీస్తోంది.