అక్షరటుడే, వెబ్‌డెస్క్: southwest monsoon : నైరుతి రుతుపవనాల ముందస్తు రాక ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ Hyderabad, నల్గొండ Nalgonda, వరంగల్ Warangal, కరీంనగర్ Karimnagar, ఆదిలాబాద్ Adilabad జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
కాగా, వాతావరణశాఖ ముందస్తుగా హెచ్చరించిన విధంగానే రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం నుంచి మేఘావృతమై ఉన్న ఆకాశం కాసేపు చిరుజల్లులు కురిపించింది. తీరా.. రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. క్రమేపీ ఎడతెరపి ఇవ్వకుండా కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి తోడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు జోరందుకున్నాయి. దీంతో జిల్లాలోని పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్తుశాఖ అధికారులు ముందస్తుగా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.
నిజామాబాద్ నగరంలో గంట నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై వర్షం నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఏరులై పారుతోంది. మరోవైపు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. వాగులు, కాలువలు, లోతట్టు ప్రాంతాల వెంబడి నివాసం ఉండేవారికి తగు సూచనలు చేశారు.