అక్షరటుడే, వెబ్డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad)లో వినాయక నిమజ్జనం ఘనంగా సాగుతోంది. వేలాది విగ్రహాలు శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరాయి.
నగరంలో దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేశారు. 303 కిలో మీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. దీంతో అధికారులు, పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Ganesh Immersion | ట్రాఫిక్ ఆంక్షలు
వేలాది విగ్రహాలు నిమజ్జనానికి తరలి రానున్నాయి. వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది భక్తులు వస్తారు. దీంతో ఎక్కడా కూడా సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినాయక విగ్రహాలు వెళ్లే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం లేదు. నగరంలో ఆదివారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉంటాయని తెలిపారు. నగరంలోకి లారీలకు ప్రవేశం లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులను (RTC Bus) సైతం మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ వరకే అనుమతిస్తారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల బస్సులకు చాదర్‌ఘాట్ వరకు అనుమతి ఇస్తారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు (Metro Train) సర్వీసులు నడపనున్నారు.
Ganesh Immersion | ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్ వినాయకుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభం అయింది. వెల్డింగ్ పనులు పూర్తి చేసి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నారు. బడా గణేశుడిని తిలకించేందుకు వేలాది మంది భక్తులు వచ్చారు. సైఫాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సాగనుంది.