అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganesh Immersion | హైదరాబాద్‌లో (Hyderabad) అత్యంత వైభవంగా జరిగిన వినాయక నిమజ్జనోత్సవాలు ఆదివారంతో ప్రశాంతంగా ముగిశాయి. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 2.61 లక్షల నిమజ్జనం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఒకటి, రెండు మినహా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. రెండ్రోజులుగా కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యక్రమం పూర్తి కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. రెండ్రోజుల పాటు కష్టపడి పని చేసిన పోలీసులు, అధికారులను ప్రశంసించారు. మరోవైపు, నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు.
Ganesh Immersion | సీఎం ప్రశంసలు..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశ్ శోభాయాత్ర (Ganesh Shobha Yatra) ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ (Panchayat Raj) ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో (Hyderabad City) లక్షలాది గణేశ్ విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
Ganesh Immersion | రెండ్రోజులు కష్టపడి..
జీహెచ్ఎంసీ పరిధిలో హుస్సేన్‌సాగర్, ఇతర చెరువులతోపాటు 74 కృత్రిమ కొలనుల్లో 2.61 లక్షల నిమజ్జనం పూర్తయింది. హుస్సేన్‌సాగర్‌లో (Hussain Sagar) దాదాపు 12 వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌సీవీ ఆనంద్ చెప్పారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. రెండురోజులుగా నిద్ర కూడా పోకుండా పర్యవేక్షించినట్లు తెలిపారు.
అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించడంతో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా కొనసాగిందన్నారు. శోభాయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న గొడవలతో ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి శనివారం అర్ధరాత్రి వరకే నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, అయితే, విగ్రహాల ఎత్తు పెరుగడంతో జాప్యం చోటు చేసుకుందని చెప్పారు. ఈసారి నిమజ్జనంలో అధునాత టెక్నాలజీని వినియోగించామని, ఐదు డ్రోన్లను మోహరించామని తెలిపారు.
Ganesh Immersion | పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం..
నిమజ్జనం పూర్తవడంతో జీహెచ్ఎంసీ (GHMC) రంగంలోకి దిగింది. పారిశుద్ధ చర్యలు ప్రారంభించింది. రోడ్లతో పాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ పోగైన చెత్తను తొలగిస్తోంది. మరోవైపు, సాగర్‌లో నిమజ్జనం చేసిన విగ్రహాలను తొలగించే పనులను సైతం ప్రారంభించింది. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతిని (Khairtabad Ganesh) మరో రెండ్రోజుల పాటు అలాగే ఉంచనున్నారు. ఆ తర్వాతే విచ్ఛిన్నం చేసి శిథిలాలను తరలించనున్నారు. మరోవైపు, హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, బషీర్‌బాగ్, అసెంబ్లీ మార్గాల్లోకి వాహనాలను అనుమతించారు.