అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Flood damage : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం సృష్టించాయి. వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి.
రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల (Heavy rains) కు కామారెడ్డి అతలాకుతలం అయింది. భారీ వర్షంతో వరదలు (Flood) పోటెత్తాయి.
చెరువులు, కుంటలు నిండిపోయి పొంగ్లిపొర్లాయి. రోడ్లపై వరద చేరి చెరువులు, నదులను తలపించాయి. అనేక చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా కామారెడ్డి పట్టణం వరదల్లో చిక్కుకుపోయింది.
పలు మండలాల్లోనూ వరదలు పొంగిపొర్లాయి. కార్లతోపాటు మనుషులు కొట్టుకుపోయారు. ఉవ్వెత్తున ముంచుకొచ్చిన వరద వల్ల జాతీయ రహదారి మూసుకుపోయింది.
వరద బీభత్సం నేపథ్యంలో పోలీసులు, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో తలమునకలైంది.
జిల్లాలో వరద బీభత్సాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. వరద నష్టం వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం (ఆగస్టు 29) అధికారులతో సమావేశమయ్యారు. వరద నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు.
దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రాథమిక గణాంకాలు సేకరించారు. అన్నింటిని క్రోడీకరించారు. చివరికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Kamareddy Flood damage | రూ. 150 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మొత్తం 633 తక్షణం పనులకు రూ. 22.47 కోట్లు, శాశ్వత పనులకు రూ. 130.37 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదిస్తూ కలెక్టర్కు నివేదికలు అందజేశారు.
శాఖల వారీగా వివరాలు
- ఇరిగేషన్ శాఖ (Irrigation Department) : 93 తక్షణ పనులకు రూ. 1.0385 కోట్లు – శాశ్వత పనులకు రూ. 33.7860 కోట్లు
- ఆర్ అండ్ బీ శాఖ (R&B Department) : 79 తక్షణ పనులకు రూ. 3.461 కోట్లు – శాశ్వత పనులకు రూ. 61.194 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department) : 48 తక్షణ పనులకు రూ. 15.0415 కోట్లు – శాశ్వత పనులకు రూ. 11.502 కోట్లు
- ఆర్.డబ్ల్యు.ఎస్ శాఖ (R.W.S Department) : 18 తక్షణం పనులకు రూ. 2.25 కోట్లు –
- విద్యుత్ శాఖ (Electricity Department) : తక్షణం పనుల (డీటీఆర్ అండ్ పోల్స్ కోసం) కింద రూ. 2.09 కోట్లు
- కామారెడ్డి మున్సిపాలిటీ : 104 తక్షణం పనులకు రూ. 11.06 కోట్లు – శాశ్వత పనులకు రూ. 13.266 కోట్లు
- బాన్సువాడ మున్సిపాలిటీ : 4 తక్షణం పనులకు రూ.35.86 లక్షలు
- బిచ్కుంద మున్సిపాలిటీ : తక్షణం ఒక పనికి రూ. 7.50 లక్షలు
- ఎల్లారెడ్డి మున్సిపాలిటీ : 5 తక్షణం పనులకు రూ. 20.30 లక్షలు
- వైద్య ఆరోగ్య శాఖ (Medical and Health Department) : 40 శాశ్వత పనులకు రూ. 47.30 లక్షలు
- జిల్లా పంచాయతీ శాఖ (District Panchayat Department) : 38 శాశ్వత పనులకు రూ. 1.0557 కోట్లు
- విద్యాశాఖ (Education Department) : 203 శాశ్వత పనులకు రూ. 9.0975 కోట్లు
Kamareddy Flood damage : ఇక పంట విషయానికి వస్తే..
అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా కూడా జల ప్రళయమే సృష్టించాయి. పంట పొలాలు, రహదారులు, నదులు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా అన్నీ ఒకే రీతిలో కలిసిపోయాయి.
ఎక్కడ చూసినా వరద నీరు తప్ప మరోటి కనిపించని దుస్థితి కొనసాగింది. పంట పొలాల్లోకి వరద చేరడంతో పూడిక పేరుకుపోయింది.
ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఇప్పట్లో పంట పొలాలు వినియోగంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక జిల్లాలో 32,907 ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.