అక్షరటుడే, భీమ్‌గల్ : Illegal Ventures | భీమ్‌గల్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలు, మేజర్ పంచాయతీల్లో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం(Pattadar Passbook) ఆధారంగానే ప్లాట్లు కొన్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. డీటీసీపీ అనుమతులు వచ్చేస్తున్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్నారు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ వెంచర్లను కట్టడి చేయాల్సిన అధికారులు ‘మామూలు’ గా తీసుకుంటున్నారు.
భీమ్‌గల్ మండలం(Bhimgal Mandal)లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. భీమ్‌గల్ పురాణపేట్ బైపాస్ రోడ్డులో ఇనాం భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా వరకు ప్లాట్లు విక్రయించారు. ఇనాం భూములని తెలిసిన సబ్ రిజిస్టర్ కార్యాలయం(Sub Registrar Office)లో రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. పట్టణంలోని అయ్యప్ప నగర్ కాలనీలో నాలుగు ఎకరాల్లో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దీన్ని అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు(Municipal Officers) అనుమతులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
Illegal Ventures | చెరువు భూమి కబ్జా చేసి..
బాపూజీనగర్ కాలనీలో వెలిసిన వెంచర్లో ప్లాట్ల విక్రయాలు పూర్తయ్యాయి. మున్సిపల్‌కు కేటాయించాల్సిన 10 శాతం స్థలం ఇవ్వలేదు. ఇందులో ఇరుకు రోడ్లు వేసినా.. పట్టించుకునే వారు కరువయ్యారు. భీమ్‌గల్ శివారులోని పూరాణపేట్ రోడ్డులో గల శారదాశ్రమం పాఠశాల(Sharadashram School) పక్కన ఏర్పాటు చేసిన వెంచర్‌కు అనుమతులు లేదు. బడా భీమ్‌గల్ రోడ్డులోని రాథం చెరువును ఆనుకొని వెంచర్ వేశారు. చెరువు భూమిని కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేయడం గమనార్హం. బెజ్జోర రోడ్డు(Bezzora Road)లో వెంచర్‌కు అనుమతులు పొందినా.. నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. రోడ్ల వెడల్పు, పన్ను చెల్లించడం, 10 శాతం స్థలం ఇవ్వడంలో ఉల్లంఘనలకు పాల్పడినట్లు సమాచారం.
Illegal Ventures | నిబంధనలు ఇవి..
సాగు భూములను వెంచర్లుగా మార్చడానికి నాలా కన్వర్షన్ చేయాలి. దానికి ఆర్డీవో అనుమతి తీసుకోవాలి. భూమి ధరలో ఒక శాతం పన్ను చెల్లించాలి. వెంచర్ స్థలంలో పది శాతం మున్సిపాలిటీకి ఇవ్వాలి. అంతర్గత రోడ్లు 33 అడుగులు, ప్రధాన రోడ్డు 40 అడుగులు, నీటి ట్యాంకు, మురుగు కాలువలు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వెంచర్ విలువలో 6శాతం రుసుం చెల్లించాలి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు(Real Estate Traders) ఇవి ఏమీ పట్టించుకోకుండానే వెంచర్లు వేసి.. ప్లాట్లు విక్రయిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Illegal Ventures | నోటీసులు జారీ చేస్తాం
– గోపు గంగాధర్, భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్
భీమ్‌గల్ పట్టణంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లకు నోటీసులు జారీ చేస్తాం. వాటిలో ప్లాట్ల క్రయవిక్రయాలు జరపొద్దని బోర్డులు ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మున్సిపల్ నిబంధనలకు లోబడి అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాతే వెంచర్ల ఏర్పాటు చేయాలి.
