అక్షరటుడే, ఇందూరు: illegal mining | ప్రకృతి వనరుల(natural resources)ను కొల్లగొట్టడం.. వాటిని క్యాష్ చేసుకోవడం.. అందలం ఎక్కడం.. దొరకకుండా రాజకీయ ముసుగు వేసుకోవడం.. ప్రస్తుతం సమాజంలో ఈ చైన్ సిస్టం (అక్రమ వలయం) నిత్యకృత్యంగా మారింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇదే తంతు కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లాలో ఇసుక, మొరం అక్రమ తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ పనుల పేరుతో అనుమతులు లేకున్నా.. అడ్డగోలుగా తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు.
ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుమును ఎగ్గొడుతూ.. అడ్డదారిలో అందలం ఎక్కుతున్నారు. తమ అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా రాజకీయాల politics ముసుగు వేసుకుంటున్నారు.
ఇలాంటి వారికి ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులే కొమ్ముకాస్తుండటంతో.. అధికారులు, పోలీసులు కూడా “మామూలు”గా తీసుకుంటున్నారు. ఇంకేం అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
నిజామాబాద్ జిల్లా Nizamabad district కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న జిల్లా కేంద్ర కారాగారం వెనుక ప్రాంతంలో మొరం అక్రమ తవ్వకాల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.
నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల లోడ్ల మేర ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కాలు దూర సందు లేనంతగా టిప్పర్ వాహనాలు నిండా లోడ్ నింపుకొని తిరుగుతున్నాయి.
పెద్ద మొత్తంలో వాహనాల రాకపోకలతో స్థానిక రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రహదారులు రూపం కోల్పోయాయి. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపాడదపా వాటిని అడ్డుకుంటున్నా.. అధికారులు, పోలీసులు అక్రమార్కులకే వంత పాడుతున్నారు.
జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఇంత పెద్ద మొత్తంలో మొరం అక్రమ దందా కొనసాగుతున్నా.. అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు వారి జేబులను అక్రమార్కులు నింపుతుండటం వల్లనే పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
illegal mining | ఆ ప్రజాప్రతినిధి అనుచరగణమేనా..
జిల్లా కేంద్ర కారాగారం వెనుక వైపునే ధైర్యంగా ఇంత పెద్ద తతంగం నడుపుతున్నా.. అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈ అక్రమ దందా నడుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకే పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు నోరు మూసుకుని ఉంటున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy ఓ వైపు అక్రమాలను నియంత్రించేందుకు తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. స్థానికంగా పోలీస్ కమిషనర్ Police Commissioner సైతం అదే విధంగా చట్ట వ్యతిరేక పనులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
కచ్చితత్వం విషయంలో కలెక్టర్ Collector సైతం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులు ఉన్న చోట మొరం అక్రమ దందా కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.