అక్షరటుడే, వెబ్‌డెస్క్: illegal mining | నిజామాబాద్ జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పగలూ రాత్రి తేడాలేకుండా గుట్టలను మాయం చేసేస్తోంది. స్పందించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తోంది. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం డెంటల్ కాలేజీ సమీపంలో గల మొరం గుట్టలో కొందరు గతకొద్ది రోజులుగా అక్రమమైనింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పనుల పేరిట నిజామాబాద్ రూరల్ తహశీల్దార్ నుంచి దొడ్డిదారిలో తాత్కాలిక అనుమతులు తీసుకుని ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు వందలకొద్ది టిప్పర్లను తరలించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి తహశీల్దార్ పేరిట ప్రభుత్వ పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ దీనికి సైతం ఓ లెక్కాపత్రం ఉంటుంది. ప్రతి టిప్పర్‌కు వేబిల్లు సహా వాహనాన్ని ఎక్కడ అన్లోడింగ్ చేస్తున్నారనేది వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కి మొరం మాఫియా ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోంది.
illegal mining | కాంగ్రెస్ నేత అండదండలతో..
స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డికి చెందిన ఓ అనుచరుడి అండదండలతో మల్లారం కేంద్రంగా ఈ మైనింగ్ దందా సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మల్లారం, మల్లారం డెంటల్ కాలేజీ చౌరస్తా, ఒడ్డెర కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తెర ముందు ఉండి మొరం తవ్వకాలు జరుపుకున్నారు. ఏక కాలంలో రెండు జేసీబీలు, రోజుకు వందకు పైచిలుకు టిప్పర్లలో మొరం తరలిస్తున్నారంటే అక్రమ మైనింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులెవరు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
illegal mining | సీజ్ చేసి చేతులు దులుపుకుని..
మల్లారం గుట్ట నుంచి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న మొరాన్ని నేరుగా నిజామాబాద్ నగరానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రైవేటు ఇళ్లు, కమర్షియల్ భవనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కాగా.. ఈ టిప్పర్లు సమీపంలోని ఐదో టౌన్ ముందు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. అయినప్పటికీ స్థానిక పోలీసులు తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఒక టిప్పర్‌ను సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పెద్దమొత్తంలో టిప్పర్లు నడుస్తున్నప్పటికీ చోద్యం చూస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకున్నామని సదరు మొరం మాఫియా బహిరంగంగానే చెప్పడం, బరితెగించి తవ్వకాలు జరపడం చర్చకు దారితీసింది.