అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad city | నిజామాబాద్ శివారులోని అర్సపల్లిలో గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. సర్వే నంబర్ 249లో కొందరు అక్రమార్కులు ఓ మాజీ కార్పొరేటర్ సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. దీనిపై ‘అక్షరటుడే’లో ‘సర్వే నంబర్ 249లో మళ్లీ అక్రమ నిర్మాణాలు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపివేయించారు.
Nizamabad city | నిజామాబాద్ నార్త్ మండలంలో..
నిజామాబాద్ నార్త్ మండలంలోని సర్వే నంబర్ 249లో మొత్తం 1,581 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గతంలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అప్పట్లో ఆరో టౌన్ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిపి ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అతని అందండలతోనే తాజాగా కొందరు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు సమాచారం. సదరు మాజీ కార్పొరేటర్ నకిలీ దస్త్రాలను సృష్టించి 249 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని పేదలకు విక్రయించాడు. వాటి ఆధారంగానే పలువురు నిర్మాణాలు పూర్తి చేశారు.
Nizamabad city | మాజీ కార్పొరేటర్ అండదండలు..
కొద్దిరోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తిరిగి అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టారు. మరో వైపు మాజీ కార్పొరేటర్ అండదండలు అందించడమే కాకుండా.. డబుల్ బెడ్రూం ఇళ్ల కింద ఆర్థిక సహాయం అందించేలా చూస్తానని వారికి హామీ ఇవ్వడం కొసమెరుపు. వాస్తవానికి ప్రభుత్వ భూమిలో నిర్మించే ఇళ్లకు రెండు పడక గదుల ఇళ్ల స్కీం వర్తించదు. అయినప్పటికీ సదరు మాజీ ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి అండదండలు అందించడం గమనార్హం.
కాగా.. మళ్లీ నిర్మాణాలు ప్రారంభించడంతో ‘అక్షరటుడే’ కథనాన్ని ప్రచురించింది. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేయించారు.