Homeజిల్లాలునిజామాబాద్​Assigned lands | అసైన్డ్​ భూముల్లో అక్రమ నిర్మాణాలు.. అనుమతులు లేకుండానే వెలిసిన భవనాలు

Assigned lands | అసైన్డ్​ భూముల్లో అక్రమ నిర్మాణాలు.. అనుమతులు లేకుండానే వెలిసిన భవనాలు

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్​: Assigned lands | అసైన్డ్​ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండానే భవనాలు నిర్మిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేదలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం అసైన్డ్​ భూములను (Assigned lands) ఇస్తోంది. అయితే వీటిని అమ్ముకోవడానికి వీలు లేదు. అలాగే ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. అయినా కూడా కొందరు బడా బాబులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల (Real estate traders) పేదల నుంచి భూములు కొనుగోలు చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.

భీమ్​గల్​ శివారులోని లింబాద్రి గుట్ట (Limbadri gutta) కింది భాగంలో ప్రభుత్వం గతంలో కొంతమందికి అసైన్డ్​ భూమి పట్టాలు అందజేసింది. లింబాద్రిగుట్ట లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయానికి (Lakshmi Narasimha Swamy Temple) ఇటీవల భక్తుల తాకిడి పెరిగింది. గుట్ట కింది భాగంలో ఉన్న అసైన్డ్​ భూములపై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, బ‌డాబాబులు కన్నేశారు. ఆయా భూముల యజమానుల నుంచి వాటిని కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమ‌తులు లేకుండానే గ‌దులు, షెడ్ల నిర్మాణాలు చేప‌ట్టారు. రెండేళ్ల క్రితం అటు నాయ‌కుల‌ను, ఇటు అధికారుల‌ను మ‌చ్చిక చేసుకుని పలు నిర్మాణాల‌ను పూర్తి చేశారు.

Assigned lands | చ‌ర్య‌లు శూన్యం..

అసైన్‌మెంట్​ భూముల్లో పుట్ట‌గొడుగుల్లా అక్ర‌మ క‌ట్ట‌డాలు వెలుస్తున్నా రెవెన్యూ అధికారులు, మున్సిప‌ల్ అధికారులు అటువైపు క‌న్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తికాగా.. అధికారులు వాటికి ఇంటి నంబర్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిత్యం భ‌క్తుల‌తో ర‌ద్దీగా ఉండే లింబాద్రిగుట్ట ప‌రిస‌రాలు నేడు అక్ర‌మ నిర్మాణాల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాల‌లో ప్ర‌భుత్వ అధికారిక స‌మావేశాలు సైతం అక్రమంగా నిర్మించిన ఫంక్షన్​ హాళ్లలో చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారి అండదండలతోనే ఈ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Assigned lands | నోటీసులు ఇచ్చి..

అక్రమ నిర్మాణాలపై అధికారులు నోటీసులు అందజేసి చేతులు దులుపేసుకున్నారు. అసైన్డ్​ భూముల్లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టార‌ని సంబంధిత భూ య‌జ‌మానులకు నోటీసులు అందజేశారు. ఇదివరకు పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిసినప్పటికీ అటు మున్సిపల్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సంబంధిత కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇంటి నంబర్లు కేటాయించలేదు

– గోపు గంగాధర్​, భీమ్​గల్​ మున్సిపల్​ కమిషనర్​

లింబాద్రిగుట్ట శివారులోని సర్వే నంబర్ 882లో నిర్మాణాలకు, కట్టడాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఆ నిర్మాణాలకు ఇంటి నంబర్లు సైతం కేటాయించలేదు. ఈ నిర్మాణాలు రెండేళ్ల క్రితం చేపట్టారు. అక్రమ నిర్మాణాల విషయమై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.