అక్షరటుడే, ఇందూరు: Prerana Program | ఇష్టపడి చదివితే జీవితం అంతా సంతోషంగా ఉంటుందని.. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మంగళవారం ‘ప్రేరణ కార్యక్రమం’ నిర్వహించారు.
Prerana Program | ఉన్నత చదువులు చదివి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు (higher education) చదివి జీవితంలో స్థిరపడేందుకు పదో తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తులో దెబ్బతీస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక అబద్ధంగా సిద్ధం కావాలన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం వసతిగృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వం పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తోడ్పాటు అందిస్తుందన్నారు.
Prerana Program | వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున..
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున చదువుపైనే దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతిసారి తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పాఠాలను బట్టి పట్టకుండా విషయపరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే పరీక్షలను సులువుగా రాసే అవకాశం ఉంటుందని వివరించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు.
Prerana Program | పదో తరగతిలో ఉత్తమ గ్రేడ్ సాధిస్తే..
పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, ఉత్తమ ప్రతిభను చాటిన విద్యార్థులకు పెద్ద స్క్రీన్‌పై టీ–20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.