అక్షరటుడే, హైదరాబాద్ : Dhana Trayodashi | ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18న వస్తుంది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు జరుపుకునే ఈ రోజు, దీపావళి పండుగ (Diwali Festival)కు (ఐదు రోజుల) ఆరంభం.
ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి దేవుడిని, లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, సకల సంతోషాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
అయితే, ధన త్రయోదశి (Dhana Trayodashi) నాడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నాయి. ఈ తప్పులు చేస్తే పేదరికం, రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాయంత్రం ఇల్లు తుడవడం : సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ముఖద్వారం ఎదురుగా తుడవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఉప్పు, పెరుగు ఇవ్వడం : చీకటి పడిన తర్వాత ఉప్పు, పెరుగు, పుల్లటి ఆహార పదార్థాలను ఎవరికీ ఇవ్వకూడదు. ధన త్రయోదశి నాడు ఈ నియమాన్ని మరింత కచ్చితంగా పాటించాలి. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగి, రాహువు అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తలుపులు మూసి వేయడం : ధన త్రయోదశి సాయంత్రం లక్ష్మీదేవి (Lakshmi Devi) ఇంటికి వస్తుందని నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో ఇంటి తలుపులు మూసి వేయకూడదు. దీపాలు వెలిగించి, లైట్లు వేసి తలుపులు తెరిచి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది.
డబ్బు అప్పుగా ఇవ్వడం : ధన త్రయోదశి నాడు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. ఇలా చేస్తే కుబేరుడికి (Kuberudu) కోపం వచ్చి, లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు.
ఖాళీ సామాన్లు ఇంటికి తీసుకురావడం : ధన త్రయోదశి నాడు రాగి, కంచు పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదం. అయితే, వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురావద్దు. నీళ్లు, బియ్యం, బెల్లం, పంచదార వంటి వస్తువుల్లో ఏదైనా వేసి ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయి.