అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన గద్వాల గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఎందో చూద్దామన్నారు. పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేక పోతున్నారన్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ దగ్గర ఓ మాట, ప్రజల దగ్గర మరోమాట చెబుతున్నారని విమర్శించారు.
KTR | ఉప ఎన్నికలు వస్తాయి
కాంగ్రెస్‌లోకి పోయిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి (Krishnamohan Reddy) సిగ్గు లేకుండా బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మీటింగ్ గద్వాలలో అయితే ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దగ్గర కూర్చొని బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్నారన్నారు. ఎవరు ఎన్ని చేసిన పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదని కేటీఆర్ అన్నారు. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపుల విషయంలో సుప్రీం కోర్టు సీరియస్‌గా ఉందన్నారు. ఆరు నుంచి 9 నెలల్లో ఉప ఎన్నిక వస్తుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుదామన్నారు.
KTR | ఎవరి అభివృద్ధి కోసం..
అవసరం అయితే రైలు కింద తలపెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్‌లో చేరనని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి గతంలో చెప్పారన్నారు. కానీ నేడు అభివృద్ధి కోసం పార్టీలోకి వెళ్లినట్లు చెబుతున్నారని విమర్శించారు. ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గద్వాలలో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన నిలదీశారు. గద్వాల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) 50 వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు.
KTR | బీఆర్ఎస్ హయాంలోనే గద్వాల అభివృద్ధి
తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కేసీఆర్ (KCR) అభివృద్ధి చేశారని కేటీఆర్ అన్నారు. మారుమూల ప్రాంతంగా ఉన్న గద్వాల్‌ను జిల్లా కేంద్రం చేశారన్నారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలను బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశామన్నారు. తమ హయాంలో గద్వాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు రంగులు మార్చి కాంగ్రెస్ మంత్రులు ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
KTR | హామీల పేరుతో కాంగ్రెస్ మోసం
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సీఎం రెడ్డి అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
KTR | గులాబీ జెండా ఎగరాలి
స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయాలని కేటీఆర్ కోరారు. గద్వాల మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్–1 (Group-1) ఉద్యోగాలను సైతం అమ్ముకున్నారన్నారు. ఈ సందర్భంగా గద్వాల మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేశవ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.