అక్షరటుడే, కామారెడ్డి : Drunk Drive | ఉమ్మడి జిల్లాల్లో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రంకన్ డ్రైవ్ కారణంగా అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీంతో పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
నిత్యం డ్రంకన్ డ్రైవ్ (Drunk Drive) తనిఖీలు చేపడుతూ.. మందుబాబుల ఆటకట్టిస్తున్నారు. తాగి బండ్లు నడుపుతూ దొరికిన వారికి కోర్టుల్లో ప్రవేశపెడుతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కోర్టులు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఓవైపు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు (Traffic Regulations) పాటించాలని పేర్కొంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సైతం ఆయా కార్యక్రమాల్లో భాగంగా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిత్యం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అయినా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు.
Drunk Drive | ఉమ్మడిజిల్లాలో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల వ్యవధిలో వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. భారీగా జరిమానాలు పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో పోలీస్ బాసులు డ్రంకన్ డ్రైవ్ కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులు, మూల మలుపులు, జంక్షన్ల వద్ద బ్రీత్ అనలైజ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా అనేక మంది మందుబాబులు దొరికిపోతున్నారు. సీపీ సాయిచైతన్య సైతం మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
Drunk Drive | భారీగా జరిమానాలు.. శిక్షలు
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వారి వాహనాలు స్వాధీనం చేసుకొని ఠాణాలకు తరలిస్తున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరుస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లో మద్యం మోతాదును బట్టి కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. పలువురికి జరిమానాలు వేస్తుండగా.. మరికొందరికి జైలు శిక్ష సైతం వేస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు దొరికిన వారికి జైలు శిక్ష విధిస్తూ జడ్జీలు తీర్పు చెబుతున్నారు. దీంతో ఇటీవల కొంతమంది మందుబాబుల్లో మార్పు వచ్చింది. ఫలితంగా ప్రమాదాలు సైతం తగ్గినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
Drunk Drive | మూడు నెలల వ్యవధిలో..
కామారెడ్డి జిల్లాలో (Kamareddy District) మూడు నెలల వ్యవధిలో వందలాది డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో 103 మందికి రూ.1,01,400 జరిమానాలు విధించగా ఇందులో 12 మందికి 2 రోజులు, 17 మందికి ఒక రోజు జైలు వేశారు. సెప్టెంబర్‌లో 391 మందికి రూ.3,52,000 జరిమానా, ఆరుగురికి 2 రోజులు, 25 మందికి ఒకరోజు జైలు శిక్ష విధించారు. అక్టోబర్లో 246 మందికి రూ.2,47,000 జరిమానా వేశారు. ఆరుగురికి రెండు రోజులు, 32 మందికి ఒకరోజు చొప్పున జైలు విధిస్తూ కోర్టులు తీర్పు చెప్పాయి. ఈ నెలలో 7 రోజుల్లో 55 మందికి రూ.55 వేల జరిమానా విధించడం గమనార్హం. ఐదుగురికి ఒకరోజు చొప్పున జైలు శిక్షతో పడింది. తాజాగా గురువారం అర్ధరాత్రి తర్వాత భిక్కనూరు బైపాస్‌లో (Bhikhnur Bypass) పోలీసుల తనిఖీల్లో భాగంగా 27 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు ఒక బస్సును సీజ్ చేశారు.
Drunk Drive | డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు
– రాజేష్ చంద్ర, జిల్లా ఎస్పీ
మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు. అది ప్రాణాలతో చెలగాటం ఆడటమే. డ్రంకన్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల భద్రతే మాకు ముఖ్యం. ప్రతిరోజూ తనిఖీలు కొనసాగుతాయి. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలి.
