అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP | ఎన్నికల సంఘంపై ప్రత్యక్ష దాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై భారతీయ జనతా పార్టీ శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల కమిషన్ (Election Commission)పై విశ్వాసం లేకపోతే ముందుగా ఆయన తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘంపై గాంధీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రుజువులు లేనివని బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా (Gourav Bhatia) అన్నారు. “రాహుల్ గాంధీ.. మీరు ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టు చేసిన పరిశీలనలను నమ్మకపోతే ఒక పని చేయండి. ముందుగా, మీరు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయండి” అని భాటియా పేర్కొన్నారు.
BJP | అందరూ తప్పుకోండి
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేనప్పుడు, ఆ పార్టీ నేతలు ఇంకా ఎందుకు పదవుల్లో ఉన్నారని భాటియా ప్రశ్నించారు. నాయకులు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్లమెంటును వీడాలని డిమాండ్ చేశారు. వారు కూడా ఎన్నికల ప్రక్రియపై సందేహాలను లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకత్వానికి ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. “మీకు ఏది సరిపోతుందో మీరు దానిని అంగీకరిస్తారు. ఏది అసౌకర్యంగా ఉందో దాన్ని తిరస్కరించి ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తారు. ఇలాంటి ట్రిక్కులు పనిచేయవు” అని భాటియా అన్నారు.
BJP | ఈసీ తీరును సుప్రీంకోర్టే సమర్థించింది
ఎన్నికల సంఘాన్ని నిష్పాక్షిక సంస్థగా, ఈసీ విశ్వసనీయతను సుప్రీంకోర్టు (Supreme Court) ధ్రువీకరించిందని భాటియా గుర్తు చేశారు. ఫలితం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈసీ నిర్ణయాలను కాంగ్రెస్ అంగీకరిస్తుందని, ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని తిరస్కరిస్తుందని మండిపడ్డారు.