అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | కష్టపడి పెంచిన తల్లిదండ్రుల (Parents)ను చాలా మంది పిల్లలు పెద్దయిన తర్వాత పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులను (Property) తీసుకుంటున్నారు. కానీ వారిని మాత్రం దగ్గరకు రానివ్వడం లేదు. కొంతమంది అయితే ఆస్తులు లాక్కొని ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. వృద్ధాప్యంలో వారికి అండగా ఉండాల్సిన సమయంలో కనీసం పట్టించుకోవడం లేదు. ఎంతో కష్టపడి తమను పెద్ద చేసిన వారిని అనాథలుగా వదిలేస్తున్నారు. ఇలాంటి వారిని సుప్రీంకోర్టు తాజాగా హెచ్చరించింది. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని స్పష్టం చేసింది. అలాంటి పిల్లలను ఇంట్లో నుంచి గెంటేసే హక్కు తల్లిదండ్రులకు ఉందని తేల్చి చెప్పింది.
Supreme Court | కుమారుడు పట్టించుకోవడం లేదని..
తమ కొడుకు పట్టించుకోవడం లేదని, సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదని మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2023లో వీరు తమ కుమారుడి నుంచి పోషణ ఖర్చులు, తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని ట్రైబ్యునల్లో పిటిషన్ వేశారు. తల్లిదండ్రులకు ప్రతి నెలా రూ.3 వేలు ఇవ్వాలని, ముంబైలోని వారి ఇంటిని ఖాళీ చేయాలని ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది.
ఆ తీర్పును బాంబే హైకోర్టు (Bombay High Court) సస్పెండ్ చేసింది. వారి కుమారుడు కూడా సీనియర్ సిటిజన్ కావడంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా ఆదేశాలు ఇచ్చే న్యాయపరిధి ట్రైబ్యునల్‌కు లేదని పేర్కొంది. దీనిపై ఆ దంపతులు సుప్రీంను ఆశ్రయించారు. విచారణ చేనపట్టిన న్యాయస్థానం హైకోర్టు తీరు తప్పని అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్ తీర్పును సమర్థించింది. నవంబర్ 30లోగా ముంబై (Mumbai)లోని ఇంటిని ఖాళీ చేసి తల్లిదండ్రులకు అప్పగించాలని వారి కుమారుడిని ఆదేశించింది.
Supreme Court | అండగా చట్టం
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి పిల్లలదేనని మరోసారి స్పష్టం చేసింది. పిల్లల నిరాదరణకు గురయ్యే వృద్ధ దంపతులకు 2007లో ప్రభుత్వం తెచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా ఉంటుందని పేర్కొంది. తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని పేర్కొంది.
