HomeజాతీయంAmit Shah | వాళ్లు వస్తే కిడ్నాప్‌, దోపిడీ, హ‌త్య శాఖ‌లు తెస్తారు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌పై...

Amit Shah | వాళ్లు వస్తే కిడ్నాప్‌, దోపిడీ, హ‌త్య శాఖ‌లు తెస్తారు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వ‌జం

బీహార్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీయే ప్రచారాన్ని ఉధృతం చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit Shah | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల (Bihar Assembly Elections) ప్ర‌చారం ఊపందుకుంది. ఎలాగైనా మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్ర‌యత్నిస్తున్న ఎన్డీయే ప్ర‌చారాన్ని ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా ఆదివారం ముజ‌ఫ‌ర్‌పూర్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ-కాంగ్రెస్-వికాశీల్ ఇన్సాద్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బీహార్ లో ‘కిడ్నాప్, దోపిడీ, హత్య’ కోసం మూడు కొత్త మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేస్తామని ఎద్దేవా చేశారు.

Amit Shah | వారి కోరిక తీర‌దు..

మ‌హాఘ‌ట్ బంధ‌న్‌లోని పార్టీలు వార‌సుల‌కు అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని య‌త్నిస్తున్నాయ‌ని షా మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుండగా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్విని బీహార్ ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారన్నారు. అయితే, ఆ రెండు పదవులు ఖాళీగా లేవని నొక్కి చెప్పారు. “లాలూ జీ, సోనియా జీ దేశం గురించి పట్టించుకోరు. లాలూ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని, సోనియా తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. కానీ నితీశ్‌ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉన్నందున వారి కోరిక ఎప్పటికీ నెరవేరద‌ని” షా తేల్చి చెప్పారు.

Amit Shah | ఎన్డీయే హ‌యాంలోనే అభివృద్ధి..

ప్రధాని మోదీ (Prime Minister Modi), నితీష్ కుమార్‌ (Nitish Kumar)లపై ప్రశంసలు కురిపించిన అమిత్ షా.. ఇద్దరు నాయకుల ప్రయత్నాలే బీహార్ ను అభివృద్ధి బాట‌లో న‌డిపించాయ‌న్నారు. ఎన్డీయే పాలనలో బీహార్ భారతదేశంలో రైలు ఇంజిన్లను ఎగుమతి చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించిందని, రాబోయే ఎన్నికల్లో పాలక కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తే వరదలు లేని బీహార్ కోసం కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. “మీరు ఒక అభ్యర్థిని ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా చేయడానికి ఓటు వేయకూడదు. బీహార్‌ను ‘జంగల్ రాజ్’ నుంచి రక్షించడానికి మీరు ఓటు వేయాలి. లాలు-రబ్రీ 15 సంవత్సరాల పాలనలో బీహార్‌లో పరిస్థితి దారుణంగా దిగజారింది. ముజఫర్‌పూర్ ప్రజలు ఎన్డీయేకు ఓటు వేయాలని నిర్ణయించుకుంటే, ఎవరూ ‘జంగల్ రాజ్’ను తిరిగి తీసుకురాలేరని” షా పేర్కొన్నారు.