అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Jagruti president Kalvakuntla Kavitha) అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
కృష్ణా నదిపై గల ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) చర్యలు చేపట్టిందన్నారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) అభ్యంతరం చెప్పిందన్నారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణలో కృష్ణనదికి (Krishna river) వరద రాదన్నారు.
దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ (Palamuru-Ranga Reddy project) కోసం రేవంత్‌రెడ్డి నిధులు కేటాయించడం లేదన్నారు. కనీసం ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఆపి ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రజలకు మేలు చేయాలన్నారు.
MLC Kavitha | సుప్రీంకోర్టుకు వెళ్లాలి
ఆల్మట్టి ఎత్తు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. అనవసర విషయాల కోసం సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లే సీఎం, రైతుల గురించి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఓ వైపు గోదావరి జలాలను బనకచర్ల పేరుతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దోచుకు వెళ్తున్నారని ఆరోపించారు. మరోవైపు కృష్ణ జలాలను కర్ణాటక ఆపే యత్నం చేస్తోందన్నారు.
MLC Kavitha | ఆయనతోనే..
ఆంధ్రలో పనిచేసిన ఆధిత్యానాథ్ దాస్‌ను తెలంగాణ సలహాదారుగా పెట్టుకున్నప్పటి నుంచి నీళ్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఆయనకు మన ప్రాంతంపై ప్రేమ ఎందుకు ఉంటుందని ఆమె ప్రశ్నించారు. ఆయననే తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వారంలో కృష్ణ ట్రిబ్యునల్ సమావేశం హైదరాబాద్‌లో జరుగనుందని కవిత తెలిపారు. ఆ సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో (Minister Uttam Kumar Reddy) పాటు సీఎం సైతం హాజరై కృష్ణా జలాల్లో మన వాటా కోసం పోరాడాలన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల పోరాడుతాం
బీఆర్ఎస్ సోషల్ మీడియా (BRS social media), హరీశ్‌రావు, సంతోష్‌రావు సోషల్ మీడియాలు తనపై దాడి చేస్తున్నాయని కవిత తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మంత్రులు, సీఎం ఇళ్లను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరలను ఇందిరమ్మ పేరిట ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు. బతుకమ్మ చీరల పేరిటే పంపిణీ చేయాలన్నారు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. మొదటి రోజు తాను చింతమడకలో జరిగే వేడుకల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు.