Homeజిల్లాలుకామారెడ్డిTU South Campus | తెయూ సౌత్​ క్యాంపస్​లో విద్యార్థుల ఆందోళన

TU South Campus | తెయూ సౌత్​ క్యాంపస్​లో విద్యార్థుల ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: TU South Campus | భిక్కనూరు సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఆదివారం రాత్రి పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థి అశ్విని ఆత్మహత్య కలకలం సృష్టించింది. దీంతో సోమవారం విద్యార్థులు క్యాంపస్​ ఆవరణలో ఆందోళనకు దిగారు. కళాశాలలో అనారోగ్య సమస్యలు, ఏవైనా ప్రమాదాలు జరిగినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సరైన వసతులు లేవంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TU South Campus | అంబులెన్స్​ స్టార్ట్​ కాకపోవడం వల్లే..

క్యాంపస్​లో ఉన్న అంబులెన్స్(Ambulance) సమయానికి స్టార్ట్​ అయిఉంటే.. అశ్విని బతికేదని విద్యార్థులు వాపోయారు. క్యాంపస్ సిబ్బంది కూడా సరైన సమయంలో స్పందించలేదని వారు ఆరోపించారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు ఒక్కరే విధుల్లో ఉన్నారని తెలిపారు. ఉన్న అంబులెన్స్ స్టార్ కావడానికి గంట సమయం పట్టిందని పేర్కొన్నారు. అంబులెన్స్ వల్లే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అశ్వినిని బైక్​పై దోమకొండ (Domakonda)కు, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రికి వెళ్లేసరికి అశ్విని మృతి చెందిందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు.

TU South Campus | విద్యార్థుల ఆందోళన

క్యాంపస్​లో అంబులెన్స్ సౌకర్యం లేక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోందని ప్రిన్సిపాల్​ను ప్రశ్నించారు. సరిగ్గా ఏడాది క్రితం ప్రీతం అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, అప్పుడు కూడా అంబులెన్స్​తో ఇలాంటి పరిస్థితే ఎదురైందని వారు గుర్తు చేశారు. ఏడాదిలో రెండు ఘటనలు ఇలాగే జరగడంతో ఇంకెప్పుడు అంబులెన్స్​ను బాగు చేయిస్తారని వారు ప్రిన్సిపాల్​ను ప్రశ్నించారు.

TU South Campus | వైద్య సదుపాయం కల్పించాలి..

వైద్య సదుపాయం కల్పించాలని, అంబులెన్స్ అందుబాటులోకి తేవాలని విద్యార్థులు క్యాంపస్​ ఆవరణలో డిమాండ్​ చేశారు. క్యాంపస్​లో ఆత్మహత్య, యాక్సిడెంట్లు కాకుండా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా అంబులెన్స్​ అనేది అందుబాటులో లేకుండా పోతోందని వారు ఆగ్రహించారు. ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.

TU South Campus | వీసీ హామీ ఇవ్వాల్సిందే..

తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పరిధిలోని వీసీ యాదగిరి రావు (VC Yadagiri Rao) నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప ఇక్కడినుంచి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. వీసీ అందుబాటులో లేరని, రిజిస్ట్రార్​తో (TU Registrar) ఫోన్​లో మాట్లాడించగా క్యాంపస్​లో కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, అప్పుడు వీసీతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించారు. విద్యార్థిని మృతి చెందిన సందర్భంలో ఇలాంటి ధర్నాలు సరికాదని పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి కామారెడ్డి జిల్లా జనరల్​ ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

South Campus | ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా..

క్యాంపస్​లో విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్విని సూసైడ్​కు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.