అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. తన ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే తానే పడగొడతానన్నారు. లేదంటే కేటీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.
కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల పట్ల ఒకరకంగా, పెద్దల పట్ల మరో రకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి నివాసాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయని, వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లదని ప్రశ్నించారు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం కాదు, అందరికి ఒకటే న్యాయమన్న హైడ్రా (Hydraa) వాళ్ల ఇండ్లను ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లనే ఇవాళ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూల్చేశారన్నారు.
Minister Ponguleti | అన్ని ఆస్తులు ఎలా సంపాదించారు
కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై సోమవారం మంత్రి పొంగులేటి స్పందించారు. తన ఇల్లు పరిధిలో ఉందని నిరూపిస్తే తానే కూల్చేస్తానన్నారు. లేకపోతే అప్పా జంక్షన్లో కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారని ఆయన కేటీఆర్‌ను ప్రశ్నించారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎవరికిఇచ్చారన్నారు. బీఆర్ఎస్ కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.