అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pak – Afghan | పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్ – అఫ్గాన్ (Pak – Afghan) మధ్య శాంతి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలు విఫలమైతే యుద్ధానికి వెళ్తామని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇస్తాంబుల్ (Istanbul)లో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యారు. గురువారం ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ (Pakistan Defense Minister Asif) తాలిబాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. బెదిరింపులకు పాల్పడటం ఉద్రిక్తతలను పెంచింది.
Pak – Afghan | యుద్ధం జరుగుతుంది
తాలిబన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సైనిక చర్య ఒకటే మార్గమా అని విలేకరులు ప్రశ్నించగా.. యుద్ధం జరుగుతుందని ఆసిఫ్ అన్నారు. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను పట్టించుకోలేదని ఆసిఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ పౌరులపై డ్రోన్ దాడులు, ISIS ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంపై మౌనం వహిస్తోందని అఫ్గానిస్థాన్ తిప్పికొట్టింది.
ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ హక్ వాసిక్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ బృందంలో సీనియర్ ఇస్లామిక్ ఎమిరేట్ సభ్యుడు అనాస్ హక్కానీ, ఖతార్‌కు తాత్కాలిక రాయబారి సుహైల్ షాహీన్, డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి రహమతుల్లా నజీబ్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ కహర్ బాల్ఖీ (Abdul Qahar Balkhi) చర్చల్లో పాల్గొంటున్నారు. జాతీయ భద్రతా సలహాదారు, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రతినిధి బృందం, రాజకీయ రాజీ కంటే భద్రతా నియంత్రణపై ఇస్లామాబాద్ (Islamabad) దృష్టిని నొక్కి చెబుతుంది. కాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులను మూసి వేశారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. పాక్‌లో 8 వేల కంటే ఎక్కువ ఆఫ్ఘన్ కంటైనర్లు చిక్కుకుపోయాయని, మరో 4 వేల కంటైనర్లు ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం.
