అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఆ పిటిషన్లను విచారించిన ధర్మాసనం రిజర్వేషన్లపై జీవోపై స్టే విధించింది. అయితే స్థానిక ఎన్నికలపై కూడా స్టే విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కోర్టు తీర్పు నివేదికలో కీలక విషయాలు పొందుపరిచింది.
BC Reservations | రిజర్వేషన్లు లేకుండా..
హైకోర్టు స్థానిక ఎన్నికల (Local Body Elections) ప్రక్రియపై స్టే విధించలేదు. అయితే బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. గతంలో కంటే బీసీలకు అదనంగా కేటాయించిన సీట్లను జనరల్‌గా ప్రకటించి ఎన్నికలు పెట్టుకోవచ్చని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్లతోనే (BC Reservations) ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంది. దీంతో హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేయనుంది.
కాగా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) ఎలాంటి తీర్పు చెబుతుందోనని ఉత్కంఠ నెలకొంది. గతంలో 50శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం జారీ జీవోను తప్పు పడితే స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల ప్రక్రియ చాలా ఆలస్యమైంది. మరింత జాప్యం జరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.