అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు అవుతాయని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో శుక్రవారం తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ నిర్వహించిన కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ (BRS) దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి లబ్ధి పొందాలని చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తోంది. తాజాగా నిరుద్యోగ బాకీ కార్డులను సైతం విడుదల చేసింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అన్నారు. రాజీవ్ యువ వికాసం ఎక్కడ అని ప్రశ్నించారు.
Harish Rao | కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి నిరుద్యోగులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) చక్కని అవకాశం అని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవి పోదన్నారు. ఇంకా మూడేళ్లు ఆయన సీఎంగా ఉంటారన్నారు. అలా అయితే మళ్లీ కాంగ్రెస్ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని చెప్పారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకుందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి నిరుద్యోగ యువత ముందుకు రావాలని కోరారు. ఆ పార్టీ ఓడిపోతేనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్నారు. తన ప్రభుత్వ నిర్ణయాలపై సీఎం సమీక్షించుకుంటారని చెప్పారు.
Harish Rao | కలెక్షన్ల సీఎం
చదువు రాని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, దేశంలో ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రి తన వద్దే హోంమంత్రిత్వ శాఖ పెట్టుకున్నారని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ (Mega DSC) అమలు కావాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు జాబ్‌లు నింపడం లేదు కానీ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి దానిలో పర్సంటేజీలు తీసుకుంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారన్నారు. కలెక్షన్ల మంత్రిగా మాత్రం సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేశారు.
