అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karreguttalu | ములుగు జిల్లా (Mulugu district) వెంకటాపురం శివారులోని కర్రెగుట్టల్లో భారీగా ఐఈడీ బాంబులు (IED bombs) బయట పడుతున్నాయి. పామునూరు శివారులో సుమారు 100కు పైగా ఐఈడీలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని (Telangana-Chhattisgarh border) కర్రెగుట్టల్లో గతంలో మావోయిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. కర్రెగుట్టల చుట్టు మందుపాతరలు పెట్టామని, అటువైపు ఎవరు రావొద్దని లేఖ కూడా విడుదల చేశారు. దీంతో బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు (Operation Karreguttalu) నిర్వహించాయి. సుమారు 20 వేల బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పట్టాయి. మావోయిస్ట్ కీలక నేత హిడ్మా అక్కడ ఉన్నాడనే సమాచారం మేరకు కూంబింగ్ చేపట్టాయి.
Karreguttalu | భారీగా ఆయుధాలు స్వాధీనం
ఆపరేషన్ కర్రెగుట్టల సందర్భంగా భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 20 రోజుల వరకు ఆపరేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఓ ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లు మరణించారు. అయితే బలగాల ఆపరేషన్‌తో మావోయిస్టులు అక్కడి నుంచి స్థావరాన్ని మార్చారు. కూంబింగ్ సమయంలో బలగాలు మావోయిస్టుల బంకర్లను గుర్తించాయి. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
Karreguttalu | రోడ్డు నిర్మిస్తుండగా..
కర్రెగుట్టల్లో గతంలో మావోయిస్టులు భారీగా ఐఈడీ బాంబులను ఏర్పాటు చేశారు. తాజాగా మొర్మూరు నుంచి కర్రెగుట్టలకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనుల సమయంలో బాంబులు బయటపడుతున్నారు. ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తూ సాయుధ బలగాలు రోడ్డు పనులు కొనసాగిస్తున్నాయి. కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల నుంచి ఆయుధ తయారీ సామగ్రి, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.