అక్షరటుడే ,ఇందూరు : Collector Nizamabad | అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనువైన భూములను గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. ఈమేరకు సంబంధిత అధికారుల శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కస్తూర్బా, ఆరోగ్య ఉపకేంద్రాలు (Health Sub-Centers), నర్సింగ్ కళాశాల (Nursing College), అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) తదితర వాటికి సొంత భవనాల నిర్మాణాల కోసం అనుమతి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే స్థల నిర్ధారణ పూర్తయిన చోట పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు స్థల సమస్య కారణంగా ల్యాప్స్ కాకుండా చూడాలన్నారు.
Collector Nizamabad | స్థలాలు కబ్జాకు గురయితే అధికారులే బాధ్యులు
ఎక్కడైనా స్థలాలు కబ్జాకు గురయితే అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. నిజామాబాద్ (Nizamabad) నగరంతో పాటు బోధన్‌లో అభివృద్ధి పనులకు తగిన స్థలాలు అందుబాటులో లేకపోతే సమీప మండలాల్లో అనువైన భూములను గుర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఆర్డీవో సాయా గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.