అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Womens World Cup | వన్డే వరల్డ్ కప్ (One Day World Cup) 2025ను గెలుచుకుని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని “ఉమెన్ ఇన్ బ్లూ” దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి. కేవలం కప్‌ను మాత్రమే కాకుండా, మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.
ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు $ 4.48 మిలియన్ (దాదాపు రూ. 39.77 కోట్లు) ప్రైజ్ మనీ లభించింది. ఇది మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇచ్చిన అత్యధిక బహుమతిగా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు $2.24 మిలియన్ (రూ. 19.88 కోట్లు) లభించాయి.
Womens World Cup | బీసీసీఐ నుంచి భారీ బోనస్
విజేత ప్రైజ్ మనీ $ 4.48 మిలియన్ కాగా.. భారత కరెన్సీలో రూ. 39.77 కోట్లు. ఇది మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు బహుమతి. ఇక రన్నరప్‌కి (దక్షిణాఫ్రికా) $2.24 మిలియన్ అంటే భారత కరెన్సీలో రూ. 19.88 కోట్లు. మొత్తం ప్రైజ్ పూల్ $13.88 మిలియన్ అంటే భారత కరెన్సీలో రూ. 123 కోట్లు. 2022 కంటే 297 శాతం ఎక్కువ. ప్రతి గ్రూప్ మ్యాచ్ విజయానికి గాను $34,314 అంటే రూ. 30.29 లక్షలు, ఇక మ్యాచ్‌లో పాల్గొన్నందుకుగాను ఫీజు $250,000 అంటే రూ. 2.20 కోట్లు అందించారు. అత్యంత విశేషం ఏమిటంటే.. ఈసారి ఐసీసీ ప్రకటించిన విజేత ప్రైజ్ మనీ 2023 పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేత కంటే ఎక్కువగా ఉండడం. ఇది లింగ సమానత్వం దిశగా ఐసీసీ (ICC) తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఐసీసీ బహుమతికి అదనంగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళల జట్టుకు కూడా భారీ బోనస్ ప్రకటించే ఆలోచనలో ఉందని సమాచారం. గతంలో పురుషుల టీ20 ప్రపంచ కప్ విజయానికి రూ. 125 కోట్ల బోనస్ ఇచ్చిన బీసీసీఐ, ఈసారి మహిళల జట్టుకూ రూ.125 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బహుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ప్రైజ్ మనీ ($4.48 మిలియన్), గ్రూప్ స్టేజ్ విజయాలు, పాల్గొన్న ఫీజు కలిపి భారత మహిళల జట్టు ఇప్పటికే రూ. 42.66 కోట్లు ($4.83 మిలియన్) గెలుచుకుంది. బీసీసీఐ బోనస్ కూడా కలిస్తే ఈ మొత్తం రూ.167 కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉంది. ఈ చారిత్రక విజయం భారత మహిళా క్రీడాకారిణులకు గౌరవాన్ని మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టింది. మహిళా క్రీడల్లో సమానతకు దారితీసే ఈ రికార్డు ప్రైజ్ మనీ, భవిష్యత్ తరాల మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
