అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ICC T20 World Cup 2026 Super 8 | ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఒక్క గ్రూప్ ఏ మినహా మిగతా గ్రూపుల నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన జట్ల జాబితా పూర్తిగా ఖరారైంది.
గ్రూప్ ఏలో పాకిస్తాన్ (Pakistan) ఎంట్రీ ఇస్తుందా లేదా యూఎస్ఏ సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మిగతా గ్రూప్ బీ, సీ, డీ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన జట్లు స్పష్టమయ్యాయి. ముఖ్యంగా వరుస విజయాలతో జింబాబ్వే జట్టు (Zimbabwe Team) ఆకట్టుకోగా, ఆస్ట్రేలియా సూపర్ 8కి చేరుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ICC T20 World Cup 2026 Super 8 | హోరా హోరీగా..
ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు అంటే మార్చి 1వ తేదీ వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, వాటిలో మూడు డబుల్ హెడ్డర్స్గా ఉండటం ప్రత్యేకత. ఈ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ముందుగానే ఖరారు చేసింది. సూపర్ 8కు ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుంచి ప్రస్తుతం టీమిండియా (Team India) మాత్రమే క్వాలిఫై కాగా, రెండో జట్టు ఏదన్నది తేలాల్సి ఉంది. ఇక గ్రూప్ బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే జట్లు అర్హత సాధించాయి. గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు ముందడుగు వేశాయి. గ్రూప్ డీ నుంచి సౌతాఫ్రికా (South Africa), న్యూజిలాండ్ (New Zealand) జట్లు సూపర్ 8లోకి ప్రవేశించాయి.
సూపర్ 8 దశలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్ జట్లు ఉన్నాయి. గ్రూప్ 2లో న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఇప్పటికే బెర్త్‌లు ఖరారు చేసుకోగా నాలుగో జట్టుగా పాకిస్తాన్ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రూప్ 1లో ఉన్న టీమిండియా బలమైన ప్రత్యర్థులతో తలపడనుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు గ్రూప్ దశలో ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన చేసి సూపర్ 8లో టఫ్ ఫైట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు విజయాలు సాధిస్తే భారత్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సూపర్ 8 దశకు బలమైన జట్లు చేరడంతో టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.