అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ICC | భారత క్రికెటర్ల తీవ్ర అవమానానికి గురైన పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటే మిగిలింది. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) తోసిపుచ్చింది.
ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు షేక్ ఇవ్వకపోవడానికి కారణం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అని, ఆయనను తక్షణమే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఆదివారం జరిగిన ఆసియా కప్(Asia Cup) మ్యాచ్‌లో టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయవద్దని భారత జట్టు కెప్టన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ను పైక్రాఫ్ట్ కోరినట్లు పీసీసీ ఆరోపించింది.
ICC | తిరస్కరించిన ఐసీసీ
అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. “పైక్రాఫ్ట్‌ను తొలగించబోమని ఐసీసీ నిన్న రాత్రి పీసీబీ(PCB)కి సమాధానం పంపింది, వారి విజ్ఞప్తిని తిరస్కరించామని” ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వేకు చెందిన 69 ఏళ్ల పైక్రాప్ట్ బుధవారం యూఏఈ, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు రెఫరీగా వ్యవహరించనున్నారు.
ICC | భంగపడిన పాక్..
ఐసీసీ టోర్నీలో భాగంగా దుబాయ్(Dubai) వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఎక్కడ కూడా భారత్‌కు పోటీలో లేకుండా పోయింది. 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసిన భారత జట్టు.. గేమ్‌లోనే కాదు, బయట కూడా పాకిస్తాన్ పరువు తీసేసింది. మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్‌తో కానీ, ఆ జట్టు సభ్యలతో కానీ మన క్రికెటర్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత చాలాసేపు మైదానంలో వేచి చూసిన పాకిస్తాన్ క్రికెటర్లు(Pakistani Cricketers) అవమానకర రీతిలో మైదానాన్ని వీడారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ ఆరోపణలు చేయగా, భారత్ తిప్పికొట్టింది. పహాల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ జట్టు సంఘీభావం తెలుపుతుందని స్పష్టం చేసింది. షేక్ హ్యాండ్ చేయకుండా ఉండడం ద్వారా పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది.