అక్షరటుడే, హైదరాబాద్: i-Bomma Ravi| తెలుగు చిత్ర పరిశ్రమకు తలనొప్పిగా మారిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ (ibomma)’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కూకట్‌పల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సీసీఎస్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నవంబరు 14న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన వెంటనే అతను పోలీసుల రాడార్‌లో చిక్కినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం (నవంబరు 15) రవిని అదుపులోకి తీసుకున్నారు. రవి నివాసం ఇంట్లో నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, సినిమాల హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐ-బొమ్మ సైట్లో అప్‌లోడ్‌కు సిద్ధంగా ఉంచిన కొత్త సినిమాల హర్డ్డిస్క్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణంలో రవి నుంచి పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం.
రవి వైజాగ్ వాసిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఉన్న ఓ అపార్ట్మెంటులో నివాసముంటున్నాడు. కాగా, రవికి తన భార్యతో విభేదాలు ఉన్నట్లు సమాచారం.
i-Bomma Ravi | విడాకుల కోసమే..
పరస్పర అంగీకారంతో వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు తెలిసింది. తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని చెబుతున్నారు.
కాగా, ట్విస్ట్ ఏమిటంటే.. రవి భారత్ వస్తున్నట్లు అతడి భార్యనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రవి భార్య ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టి, అరెస్టు చేసినట్లు సమాచారం.
