అక్షరటుడే, వెబ్‌డెస్క్ : iBOMMA Ravi Bail | ఐబొమ్మ రవి జైలు నుంచి విడుదల అయ్యాడు. గతేడాది నవంబర్‌లో అతడిని హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం టీవీ (Bappam TV) వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్న ఇమ్మడి రవి (Immadi Ravi)ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి. రవిని కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను అతడి చేత క్లోజ్ చేయించారు. ఈ క్రమంలో రవి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 90 రోజుల తర్వాత చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చాడు.
iBOMMA Ravi Bail | షరతులతో కూడిన బెయిల్
ఐబొమ్మ రవిపై కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని.. దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. అతడిపై ఐదు కేసులు నమోదు కాగా.. ప్రతి కేసులో రూ.25 వేలు వ్యక్తిగత బాండ్, ఇద్దరు పూచీకత్తులు తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉందంటూ కోర్టు కండీషన్ పెట్టింది. పాస్‌పోర్టులను కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా రవి పైరసీ సినిమాలు అప్లోడ్ చేయడం ద్వారా.. బెట్టింగ్ యాప్‌ల నుంచి భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు.