అక్షరటుడే, బాన్సువాడ: Birkoor | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానని, కానీ తనకు రావాల్సిన ఫండ్‌ను అడ్డుకుంటున్నారని బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ పేర్కొన్నారు.
బీర్కూర్ మండలం మల్లాపూర్ (Mallapur) గ్రామంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivas Reddy) ఆదేశాల మేరకు వడ్డీ కింద రూ.30 లక్షలు తీసుకున్నానని, అందులో రూ.5 లక్షలు వడ్డీతో సహా చెల్లించానని తెలిపారు. కానీ తనకు రావాల్సిన బిల్లులు ఆపి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
కానీ అభివృద్ధి పనుల్లో భాగంగా నేను చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఆపారని.. వాటిని ఇప్పించాలని డిమాండ్ చేశారు. నాకు రావాల్సిన బిల్లులు ఇప్పిస్తే దేవస్థానం డబ్బులు మొత్తం చెల్లిస్తానని స్పష్టం చేశారు. రూ.1.10 కోట్లు డబుల్ బెడ్ రూం బిల్లులు (Double bedroom bills) రావాల్సి ఉన్నాయని, రూ.70లక్షలు ఎస్డీఎఫ్ డబ్బులు రావాల్సి ఉన్నాయన్నారు. నాకు రావాల్సిన బిల్లులు ఆపలేదని గుడిలో తడిదుస్తులతో ప్రమాణం చేద్దామని ఎమ్మెల్యేకు సతీశ్ సవాల్ విసిరారు.
గుడి డబ్బులు కాజేశానని సోషల్ మీడియాలో నాపై తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు రావాల్సిన బిల్లులు రాకుండా ఎమ్మెల్యే పోచారం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అంజవ్వ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ అంజయ్య, మారుతి, సాయి శ్యాం, ఓంకార్, రామకృష్ణారెడ్డి, మోహన్, సాయిలు, పీరుగొండ, మోహన్ నాయక్ సంగ్రామ్ నాయక్, గాదె మోహన్ తదితరులు పాల్గొన్నారు.