అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఆదివారం బీజేపీ(BJP)లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో గువ్వల బాలరాజు నేడు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ తన కంటే పెద్దవాడేమి కాదని గువ్వల బాలరాజు అన్నారు. తనను బచ్చగాడు అనడంపై ఆయన స్పందించారు. కేటీఆర్ విదేశాల్లో చదువుకుని ఉండొచ్చు కానీ.. తనకు ఉన్న అనుభవం లేదన్నారు. ఆకలి కేకలను వినిపించడం మొదలుపెడితే గ్రామాల్లో కేటీఆర్‌ను అడుగు పెట్టనివ్వను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Guvvala Balaraju | అచ్చంపేటలో కేటీఆర్ సభ!
గువ్వల బాలరాజు పార్టీని వీడటంతో బీఆర్ఎస్ పార్టీ కీలక చర్యలు చేపట్టింది. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపడానికి త్వరలో కేటీఆర్ సభ పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) అచ్చంపేటలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బాలరాజు పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. దీంతో గువ్వల పార్టీని వీడినా.. కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపడానికి కేటీఆర్ సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. కాగా అచ్చంపేటలో ఎవరు ఎన్ని సభలు, సమావేశాలు పెట్టుకున్నా తనను ఎవరు ఏమి చేయలేరని గువ్వల వ్యాఖ్యానించారు.
