Homeతాజావార్తలుKavitha Janam Bata | కేసీఆర్​ పిలిస్తే వెళ్తా.. బీఆర్​ఎస్​తో సంబంధం లేదు.. కవిత కీలక...

Kavitha Janam Bata | కేసీఆర్​ పిలిస్తే వెళ్తా.. బీఆర్​ఎస్​తో సంబంధం లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో తనను నిజామాబాద్​కే పరిమితం చేశారన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె వరంగల్​లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్​ (KCR) పిలిస్తే కుమార్తెగా ఇంటికి వెళ్తానని, కానీ బీఆర్​ఎస్​తో సంబంధాలు తెగిపోయానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని ఆమె అన్నారు. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తానని, రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేశారు.

Kavitha Janam Bata | వారికి అవకాశం రావాలి

అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే తన లక్ష్యమని కవిత (Telangana Kavitha) అన్నారు. మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్లీ మొదలు పెట్టాలన్నారు. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుందన్నారు. లేదంటే పొలిటిషియన్ పిల్లలు, వాళ్ల చుట్టాలే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో (Jubilee Hills Elections) బిజీగా ఉన్నాయని విమర్శించారు. అందుకే జాగృతి తరఫున తాము ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.

Kavitha Janam Bata | అవమానించారు..

బీఆర్​ఎస్​లో 20 ఏళ్లు పనిచేస్తే తనను అవమానకరంగా బయటకు పంపించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నాకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. తాను తెలంగాణ (Telangana) బిడ్డనేనని, ఆకలినైనా తట్టుకుంటాను, కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోనన్నారు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తానన్నారు. కానీ రాజకీయంగా వెళ్లనని స్పష్టం చేశారు. పొలిటికల్​గా బీఆర్ఎస్​తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్​ఎస్​ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు.

Kavitha Janam Bata | నిజామాబాద్​కే పరిమితం చేశారు

తాను బీఆర్​ఎస్​లో ఉన్న సమయంలో నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)కే పరిమితం చేశారని కవిత తెలిపారు. ఉద్యమంలో బతుకమ్మ సంబరాల్లో తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగానని చెప్పారు. అయితే తెలంగాణ వచ్చాక నిజామాబాద్​కు మాత్రమే పరిమితం కావాలన్నారని చెప్పారు. తాను చెబితే పనులు చేసే పరిస్థితి లేకుండే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా తన దగ్గరకు వచ్చిన వారికి శక్తిమించి పనులు చేసేందుకు ప్రయత్నించానని తెలిపారు.

Kavitha Janam Bata | రెండే కులాలు..

తెలంగాణలో ప్రతి వర్గానికి న్యాయం జరగలేదని కవిత అన్నారు. అది సామాజిక తెలంగాణ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. కుల వివక్ష తీస్తేనే ఆత్మగౌరవం వస్తుందని, లేదంటే పైసా ఉండాలన్నారు. ప్రస్తుతం రెండే కులాలు ఉన్నాయని ఆమె చెప్పారు. పైసలు ఉన్న కులం, లేని కులం అని వ్యాఖ్యానించారు. పైసలు ఉంటే కులం అడగకుండా ఫైవ్ స్టార్ రేంజ్​లో మర్యాద ఇస్తారని చెప్పారు.

Kavitha Janam Bata | హరీశ్​రావుపై మరోసారి ఆరోపణలు

కవిత మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)పై మరోసారి ఆరోపణలు చేశారు. ఎంజీఎం ఆస్పత్రి భవనానికి రూ.11 వందల కోట్లో ఒక కంపెనీకి వచ్చిన పనులను రూ.17 వందల కోట్లతో బీఆర్​ఎస్​ హయాంలో మరో కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. ఆ బినామీ కంపెనీ హరీశ్​రావుది అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ కమిటీ వేసిందని, మరి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. గతంలో తాను నిజామాబాద్​ బస్టాండ్​ కోసం రూ.30 కోట్లు అడిగితే ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్​ పాలిటెక్నిక్​ కాలేజీలో హాస్టల్​కు సైతం నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్​ ప్రభుత్వం (BRS Government)పై ఆమె విమర్శలు చేశారు. దీంతో బీహెచ్​ఈఎల్ వారితో మాట్లాడి హాస్టల్ భవనం కట్టించినట్లు గుర్తు చేశారు.

బీఆర్​ఎస్​ హయాంలో తాను ఎలాంటి అవినీతి చేయలేదని ఆమె అన్నారు. తనకు డబ్బు మీద ఆశ లేదన్నారు. ఒక టీచర్​ను ట్రాన్స్​ఫర్​ చేయించే పరిస్థితి లేకుండేనని, అలాంటిది అవినీతి ఎలా చేస్తానని ఆమె అన్నారు. తనకు బీఆర్ఎస్​లో ఎవరితోనూ పంచాయితీ లేదన్నారు. కుటుంబం నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Must Read
Related News