అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR on SIT Notices | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు సిట్ విచారణాధికారిగా (SIT investigation) ఉన్న ఏసీపీకి లేఖ రాశారు.
ఫోన్ ట్యాపింగ్ (phone tapping) వ్యవహారంలో ఆదివారం విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం నందినగర్‌లోని నివాసంలో విచారిస్తామని తెలిపారు. కేసీఆర్ శనివారం న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు. అనంతరం సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సిట్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
KCR on SIT Notices | విచారణకు సహకరిస్తా..
ఇంటి గోడకు నోటీసులు అతికించడంపై కేసీఆర్ (KCR) అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నానని.. కానీ మీరు హైదరాబాద్ పరిధిలో మీరు విచారణ చేయాలన్నారని” పేర్కొన్నారు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అధికారులు వచ్చి తన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సెక్షన్ 160 CrPC కింద అధికార పరిధి లేదన్నారు. చట్టం ప్రకారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో మాత్రమే స్టేట్మెంట్ నమోదు చేయాలని గుర్తు చేశారు. అయినా.. తాను సహకరిస్తానని చెప్పారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించడానికి సిద్ధం అయ్యారు. దీంతో రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసు కొలిక్కి వస్తుందా.. లేదా అనేది చూడాలి.