అక్షరటుడే, వెబ్డెస్క్: Mlc Kavitha | జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) ప్రకటించారు.
ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన రైతులకు మద్దతు తెలిపారు. వారితో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతుల ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు. ఆర్డీఎస్ కెనాల్, పచ్చని పంట పొలాల వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతిచ్చారన్నారు. ఇందుకు మనం సమ్మతిస్తే భవిష్యత్లో ఫ్యాక్టరీ వ్యర్థాలను కెనాల్లోకి వదులుతారన్నారు. ఈ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ అనుమతిచ్చినా, కాంగ్రెస్ అనుమతిచ్చినా తప్పే అవుతుందని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు రైతులతో కలిసి ఫైట్ చేస్తానని చెప్పారు. భూములను కాపాడుకునేందుకు ఆందోళన చేస్తే రైతుల మీద లాఠీ ఛార్జ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ముందు రైతులతో మాట్లాడి వాళ్లను ఒప్పించాలి కదా అని ప్రశ్నించారు. పోలీసుల జులుంతో ఆపుతామంటే కుదరదన్నారు.
‘ఇది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదు. ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఈ కంపెనీని రద్దు చేయించటం పెద్ద విషయమేమీ కాదు. కృష్ణానది పక్కన నారాయణ్ పేట వద్ద కూడా ఇలాగే ఫ్యాక్టరీకి ప్రయత్నం చేస్తున్నారు. నేను కంపెనీలు రావద్దని చెప్పడం లేదు. కానీ పచ్చని పంట పొలాల వద్ద వాటికి అనుమతి ఎలా ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.
‘రెడ్ జోన్ మార్క్ వద్ద కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వండి. మాకు అభ్యంతరం లేదు. ఈ ప్రాంతంలో రోడ్లు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మొత్తం ఇసుక దోపిడీకి అలవాటు పడి టిప్పర్లను విపరీతంగా తిప్పుతున్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’ అని పేర్కొన్నారు.
Mlc Kavitha | సీఎం సొంత జిల్లా అయినా..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత జిల్లా అని.. అయినా కూడా ఆయనకు గద్వాల్, ఆలంపూర్ ప్రజల గోస పట్టటం లేదని కవిత మండిపడ్డారు. రైతులు పోరాటం చేస్తుంటే కేసులు పెట్టారని.. మంచి లాయర్లను పెట్టి ఆ కేసులపై ఫైట్ చేస్తామని భరోసా కల్పించారు. అధికారులు, ప్రభుత్వంలో కదలిక వచ్చేలా జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కాదని.. నిరంతరం నాయకులు ప్రజల్లో ఉండాలని నమ్మే వ్యక్తిని అని పేర్కొన్నారు.