అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mudragada Padmanabham | తనకు క్యాన్సర్(Cancer) లేదని కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తన తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆయనను తన సోదరుడు బంధించాడని ముద్రగడ కుమార్తె క్రాంతి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై ముద్రగడ స్పందించాడు. తనకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్పా ఏ వ్యాధి లేదన్నారు. తన చిన్న కుమారుడు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి, అసూయతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mudragada Padmanabham | కుమారుడికి దూరం చేసే కుట్ర
తనను తన కుమారుడికి దూరం చేసే కుట్ర చేస్తున్నారని ముద్రగడ అన్నారు. ‘‘మా అబ్బాయిని నాకు దూరం చేస్తే.. నా కూతురు దగ్గరికి వెళ్తాననుకుంటున్నారేమో.. ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటికి నేను వెళ్లను’’ అని పేర్కొన్నారు. తాను నిత్యం కార్యకర్తలను కలుస్తున్నట్లు తెలిపారు. తనను ఎవరూ బంధించలేరని, ఇంట్లో బంధించి ఇబ్బందులు పెడుతున్నారనడం బాధాకరమన్నారు.
కూతురు క్రాంతిని ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేసిన ముద్రగడ తన ఆనారోగ్య సమస్యలపై వివరణ ఇచ్చారు. ఈ మధ్య తమ కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోందని కుమార్తెను ఉద్దేశించి ముద్రగడ పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్థలు వచ్చాయని చెప్పారు.