అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IBOMMA Warning | హైదరాబాద్ పోలీసులు ఇటీవల దేశంలోనే అతి పెద్ద పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఇతర సినిమాలను పైరసీ చేస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన అనంతరం అప్పటి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) మీడియాతో మాట్లాడారు.
పైరసీ వెబ్సైట్ల(Piracy Websites) ఆటకట్టిస్తామని ఆయన తెలిపారు. ఐ బొమ్మ నిర్వాహకులను సైతం అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. సీవీ ఆనంద్ ప్రకటనపై తాజాగా ఐ బొమ్మ స్పందించింది. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే ఈ వెబ్‌సైట్ పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఐ బొమ్మ పేరిట ప్రకటన వైరల్ అవుతోంది. ‘‘మీరు మాపై దృష్టి పెడితే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది’ అని ఐ బొమ్మ పోలీసులను హెచ్చరించింది. తమ వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే పోలీసుల ఫోన్ నంబర్లు బయటపెడతామంటూ ప్రకటన విడుదల చేసింది. ‘ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. వెనక్కి తగ్గం’ అని ఐ బొమ్మ పేర్కొంది.
IBOMMA Warning | మమ్మల్ని ఆపలేరు
‘‘మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు.. OTTలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయి.. మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే.. ఆపడం అసాధ్యం.. మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరంటూ’’ ఐ బొమ్మ ప్రకటన చేయడం గమనార్హం. హీరోలకు అంత రెమ్యూనేషన్ ఎందుకని ఐ బొమ్మ(IBOMMA) ప్రశ్నించింది. వారికి భారీగా పారితోషికం ఇచ్చి టికెట్ల రేట్లు పెంచుతున్నారని ఐ బొమ్మ పేర్కొంది. దీంతో సామాన్యులు బలి అవుతున్నారని తెలిపింది.
IBOMMA Warning | అసలు ఏం జరిగిందంటే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఫిర్యాదు మేరకు, పోలీసులు ఐ బొమ్మతో సహా 65 కి పైగా వెబ్‌సైట్‌లపై దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పైరసీతో 2024లోనే టాలీవుడ్ దాదాపు రూ.3,700 కోట్లు కోల్పోయిందని పేర్కొన్నారు. నిందితులు థియేటర్లలో కెమెరాలను ఉపయోగించి మూవీలను పైరసీ చేస్తున్నారని, అలాగే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్‌లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్లను దొంగలిస్తున్నట్లు తెలిపారు. ఆయా పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకులు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నుంచి ప్రకటనల ద్వారా రూ.కోట్లు సంపాదించారని తెలిపారు. ఐ బొమ్మపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఐ బొమ్మ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుండటం గమనార్హం.