అక్షరటుడే, కమ్మర్పల్లి: Mutyala Sunil Reddy | కొంతమంది జీఎస్టీ అధికారుల అత్యుత్సాహం కారణంగానే తన ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థపై అనవసర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయని ట్రావెల్స్ అధినేత, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి (Mutyala Sunil Reddy) అన్నారు. ఈ మేరకు మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) ప్రజానీకానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
Mutyala Sunil Reddy | జీఎస్టీ అధికారుల అత్యుత్సాహం వల్లే..
కొంతమంది జీఎస్టీ అధికారులు (GST officials) అత్యుత్సాహం వల్లే తన సంస్థపై విచారణ జరిగిందని సునీల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12శాతం, మిగతా రాష్ట్రాలలో ఐదు శాతం జీఎస్టీని బస్సుల మీద యథావిధిగా కట్టేవాళ్లమని ఆయన తెలిపారు. కానీ మొత్తం మీద 12శాతం జీఎస్టీ కట్టాలని అధికారులు తమపై ఒత్తిడి చేశారన్నారు. దానివల్ల రూ.28 కోట్లు అదనంగా జీఎస్టీ కట్టాలని తనపై తన సంస్థపై విచారణ చేపట్టారన్నారు. విచారణ సందర్భంగా తనను అరెస్టు చేయాలని చూశారన్నారు. కోర్టుకు వెళ్లడంతో అనవసరంగా ఓ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ కోర్టు సైతం జీఎస్టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు.
Mutyala Sunil Reddy | నిష్పక్షపాతంగా పనిచేస్తున్నా..
ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ (Orange Travels company) నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రభుత్వానికి కట్టాల్సిన పనులన్నీ కడుతుందని సునీల్‌రెడ్డి తెలిపారు. ఇది కేవలం వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు విచారణ జరిగిందని ఆయన తెలియజేశారు. విచారణ సందర్భంగా ఓ రెండు ఛానెళ్లు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నన్ను వ్యక్తిగతంగా బద్నాం చేయాలని చూశారని కానీ అది సాధ్యపడలేదని కోర్టు తీర్పు తర్వాత నా వెంటపడ్డ టీవీ ఛానళ్లు ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించకుండా మాయమయ్యాయన్నారు.
Mutyala Sunil Reddy | ప్రశాంత్ రెడ్డి పన్నాగమిది..
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పన్నాగంలో భాగంగానే తనపై ఇదంతా జరిగిందని సునీల్‌రెడ్డి ఆరోపించారు. కోర్టు తీర్పే వారందరికీ చెంపపెట్టు అయిందని సునీల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఇసుకను తక్కువ ధరకు అందిస్తే వారి కళ్లు మండుతున్నాయని వారి హయాంలో రూ.6వేలకు తక్కువ ధరకు ఇసుక ఏనాడు లేదని ఇప్పుడు రూ.3,000 లోపు వస్తే వారు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తక్కువ ధరకు ఇసుకను అందిస్తే ఇసుక మాఫియా అని అంటున్నారని ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Mutyala Sunil Reddy | బట్టాపూర్ క్రషర్లో ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం..
బట్టాపూర్లో క్రషర్ ద్వారా పదివేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్విన వ్యక్తి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అని సునీల్ రెడ్డి ఆరోపించారు. ఈ విధంగా ప్రభుత్వానికి చుట్టుపక్కల రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర ఆయనదన్నారు. ఇలా అదనంగా క్యూబిక్ మీటర్లు తవ్వి ప్రభుత్వానికి రూ.112 కోట్ల బకాయి ఉన్నాడని అలాగే కరెంటు బిల్లుల ద్వారా రూ.52 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు కక్షపూరితంగా వ్యవహరించలేదని, మేము వీటిపై విచారణ జరపాలని ఎవరి మీద ఒత్తిడి తేలేదన్నారు.
Mutyala Sunil Reddy | ముఖాముఖి చర్యకు సిద్ధమా..
సంక్రాంతి లోపు ఏరోజునా సరే తాను ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో ముఖాముఖి చర్చకు సిద్ధమని సునీల్‌రెడ్డి సవాల్ విసిరారు. చర్చావేదిక సమయం, స్థలం డిసైడ్ చేయాలన్నారు. ఎవరు అవినీతిపరుడో, ఎవరు బకాసురుడో తేల్చుకుందామని.. ఒకవేళ చర్చకు రాకుంటే బట్టాపూర్ దొంగగా ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరపున నామకరణం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రశాంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. రూ.120 కోట్లు ఖర్చుపెట్టి గెలిచి ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని.. ఆ దొంగ పనులు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.