అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gadwal MLA | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. ఇటీవల సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పుతో వారు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ (BRS) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు) కాంగ్రెస్‌లో చేరారు. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Gadwal MLA | సుప్రీం ఆదేశాలతో..
బీఆర్ఎస్ నాయకుల పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందించి చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో ఆయన ఎమ్మెల్యేలకు నోటీసులు అందిస్తున్నారు. స్పీకర్ నోటీసులతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఎక్కడ తమపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్నారు.
Gadwal MLA | కాంగ్రెస్ కండూవా కప్పుకోలేదు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishnamohan Reddy)కి సైతం స్పీకర్ నోటీసులు అందించారు. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే అంశాన్ని స్పీకర్ నోటీస్‌కు సమాధానంగా పంపినట్లు చెప్పారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 37 మంది ఎమ్మెల్యేలో తాను ఒకడిని స్పష్టం చేశారు. తాను సీఎంను కలిసిన వివరాలు స్పీకర్‌కు వివరించినట్లు చెప్పారు. కేసీఆర్‌ను గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినని ఆయన తెలిపారు. పార్టీల కన్నా గద్వాల అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు.
Gadwal MLA | వారి పరిస్థితి ఏమిటో..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో కొందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. కడియం శ్రీహరి తన కూతురిని కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకున్నారు. ఒకవేళ స్పీకర్ చర్యలు తీసుకుంటే.. వీరు తప్పించుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మిగతా ఎమ్మెల్యేలు సాంకేతిక అంశాలతో పార్టీ మారలేదని చెప్పే అవకాశం ఉన్నా.. వీరికి మాత్రం ఆ ఛాన్స్ లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.