Homeతాజావార్తలుHydraa | రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Hydraa | రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లో 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు (Hydra officials) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చెర నుంచి విడిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం (Serilingampally mandal) కొండాపూర్‌లో పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కొందరు కబ్జా చేయాలని చూశారు. అయితే హైడ్రా వారి ఆట కట్టించింది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ ప్రాంతంలో ఎక‌రం రూ. 200 కోట్లు వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ.700 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.

Hydraa | పార్కు స్థలాల విక్రయం

కొండాపూర్ విలేజ్‌(Kondapur Village)లో 57.20 ఎక‌రాల విస్తీర్ణంలో 627 ప్లాట్ల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ఏఎల్ కాల‌నీని 1980లో ఏర్పాటు చేశారు. 1.20 ఎక‌రాల చొప్పున 2 పార్కులు, 2 ఎక‌రాల ప‌రిధిలో మ‌రో పార్కుతో పాటు.. 1000 గ‌జాల మేర ప్ర‌జావ‌స‌రాల‌కు స్థ‌లాల‌ను కేటాయించారు. ఇప్ప‌డివే ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. పార్కుల‌ను బైనంబ‌ర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి విక్రయించారు. వేంక‌టేశ్వ‌ర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

Hydraa | కోర్టు ఆదేశాలతో..

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు స్థలాను ప్లాట్లుగా మార్చినట్లు గుర్తించారు. 1.20 ఎక‌రాల మేర ఉండాల్సిన పార్కును 11 ప్లాట్లు చేసి అమ్మేసిన‌ట్టు తేల్చారు. మ‌రో రెండు పార్కుల‌ను కూడా అలాగే బై నంబ‌ర్ల‌తో విక్రయించారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైకోర్టును (High Court) కూడా ఆశ్ర‌యించారు. పార్కుల‌తో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడాల‌ని హైకోర్టు సూచించింది. దీంతో హైడ్రా శుక్ర‌వారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. దీంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.