అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతోంది. ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటుంది. తాజాగా కొండాపూర్ (Kondapur)లో రూ.86 కోట్ల విలువైన భూమిని కబ్జా నుంచి విడిపించింది.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని రాఘవేంద్రనగర్‌లో 2000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా శుక్రవారం కాపాడింది. రాజేశ్వరి నగర్లో 4300 గజాల స్థలానికి శనివారం విముక్తి కల్పించింది. రాజరాజేశ్వరి నగర్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీలో 4300 గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించారు. ఇక్కడ 1978 లే అవుట్ వేశారు. మొత్తం 350 ప్లాట్లు ఉండగా.. 4300 గజాల స్థలాన్ని ప్రజావసరాల కోసం వదిలేశారు. అయితే ఆ స్థలాన్ని కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారు. ఇదే విషయాన్ని కాలనీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Hydraa | ఆక్రమణల తొలగింపు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ఆదేశాల మేరకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో శనివారం తొలగించారు. 4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ భూమిని అమ్మిన పోచయ్య, రాజుతో పాటు స్థలాన్ని కొన్న మాధవరెడ్డి అతని కుమారుడిపైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులను నమోదు చేశారు.
కాగా హైడ్రా దూకుడుతో ఆక్రమణదారులు ఆందోళన చెందుతన్నారు. నగరంలో చెరువులు, కుంటలు, నాలాలతో పాటు పార్కులు, రోడ్ల స్థలాలను సైతం హైడ్రా రక్షిస్తోంది. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తోంది. దీంతో నగరంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.
