అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తామహబూబ్ పేటలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సోమవారం కాపాడారు.
మక్తామహబూబ్ కుంట ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిని కబ్జా చేయడానికి కొందరు యత్నించారు. వారి ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. ఇక్కడ కబ్జాల చెర నుంచి కాపాడిన 5 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ రూ. 600ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200 మీటర్ల మేర వేసిన 18 షెట్టర్లను హైడ్రా అధికారులు తొలగించారు. దుకాణాల వెనుక వైపు ప్రైవేటు బస్సుల పార్కింగ్ ఉంచిన స్థలాన్నికూడా హైడ్రా ఖాళీ చేయించింది.
Hydraa | కబ్జా చేసి షట్టర్ల ఏర్పాటు
మియాపూర్ (Miyapur) సర్వే నంబర్ 39లో మక్తామహబూబ్‌పేట చెరువు కట్ట కబ్జాతో పాటు.. గతంలో మైనింగ్‌కు ఇచ్చిన సర్వేనంబరు 44/5 లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ భూముల్లో షట్టర్ (దుకాణం)లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. అక్రమార్కులు ఒక్క షట్టర్ నుంచి ప్రతి నెలా రూ.50 వేల చొప్పున ఆదాయం పొందుతున్నారు. అలాగే అక్కడ ప్రైవేటు బస్సుల పార్కింగ్‌కు స్థలాన్ని ఇచ్చి నెలకు రూ. 8 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆక్రమణలను తొలగించారు.
Hydraa | బడాబాబుల మద్దుతుతో..
కబ్జాలకు పాల్పడిన కూన సత్యంగౌడ్, బండారి అశోక్ వెనుక బడాబాబులున్నట్టు సమాచారం. వారు వెనుక ఉండి వీరితో కబ్జాల పర్వాన్ని నడుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భూమి తమదని చెబుతున్న వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడమే కాకుండా.. తాము వేరే వాళ్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని చెబుతున్నారు. వేరే వాళ్లు ఎవరనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఈ భూమికి ఆనుకుని ఉన్న 5 ఎకరాల చెరువు కబ్జా ప్రయత్నాలకు కూడా హైడ్రా చెక్ పెట్టింది.
Hydraa | ఆగ్రోస్ భూమిని..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ (Uppal) మండలంలోని మౌలాలి – నాచారంలో తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Agros Industries Development Corporation) భూములను హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 29/1 తో పాటు 30లలో 23.28 ఎకరాలను ప్రభుత్వం కార్పొరేషన్‌కు కేటాయించింది. అయితే ఈ భూమికు ఆనుకుని ఉన్న దుర్గానగర్, కమలాబాయ్ నగర్, బాబానగర్ కాలనీలవైపు కొంతమేర ఆక్రమణలు జరిగాయి. 4 ఎకరాలు కబ్జాకు గురయ్యింది. దీనిపై కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇప్పటికే ఇళ్లు కట్టుకుని నివాసం ఉన్న వారి జోలికి వెళ్లలేదు. ప్రీకాస్ట్ ఇటుకలతో ప్రహరీ నిర్మించి.. అందులో వేసిన చిన్న షెడ్డులను తొలగించారు.