అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) మరో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. 3 వేల గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
కూకట్‌పల్లి పరిధిలోని 3 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులను హైడ్రా (Hydraa) పరిరక్షించింది. ఈ భూమి విలువ సుమారు రూ.35 కోట్లు ఉంటుందని అంచనా. భాగ్యనగర్ ఫేజ్-3 కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం తమ ప్రాంతంలోని రెండు పార్కులు ఆక్రమణకు గురయ్యాయని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Hydraa | ఆక్రమణల తొలగింపు
కూకట్పల్లిలో 1987లో భాగ్యనగర్ ఫేజ్-3 లేఅవుట్ను హుడా ఆమోదించింది. సర్వే నంబర్లు 197, 200 సిరీస్‌లలో 36 ఎకరాల విస్తీర్ణంలో లే అవుట్ అభివృద్ధి చేశారు. ఈ కాలనీలో 357 ప్లాట్లు ఉన్నాయి. లే అవుట్ వేసే సమయంలో పార్కుల కోసం స్థలం వదిలారు. ఇటీవల అవి ఆక్రమణకు గురి అయ్యాయి. 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఒక పార్కులో సగం ప్రాంతం ఆక్రమణకు గురవగా, ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న మరో పార్కులో సుమారు 1,000 చదరపు గజాలు ఆక్రమణకు గురయింది. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా ఆక్రమణలు నిజమని నిర్ధారించింది. దీంతో శనివారం అధికారులు పార్కుల్లోని ఆక్రమణలను తొలగించారు. రెండు పార్కుల చుట్టూ కంచె ఏర్పాటు చేసి, హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. పార్కులను కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.