అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) గండిపేట మండలం గంధంగూడ గ్రామంలో 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని శుక్రవారం హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 43 ఉన్న ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
గ్రామంలోని ఈ సర్వే నంబరులో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి (government land) ఉండగా.. ఇందులో ఒక ఎకరాను విద్యుత్ సబ్ స్టేషన్కు, మరో 9 ఎకరాలను జీహెచ్ఎంసీ చెత్తవేయడానికి ప్రభుత్వం గతంలో కేటాయించింది. ఈ కేటాయింపులు ఇలా ఉండగా.. మిగిలిన భూమి క్రమంగా కబ్జా అవుతోందని స్థానికుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది.
Hydraa | క్షేత్రస్థాయిలో పరిశీలించి..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRAA Commissioner Ranganath) ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాత శుక్రవారం ఫెన్సింగ్ వేసింది. ఇప్పటికే ఒక ఆలయం, మసీదు నిర్మాణం అక్కడ జరిగింది. వాటిని కాపాడుతూనే ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి భవిష్యత్తులో కబ్జాలకు గురి కాకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. కాగా ఈ భూమి విలువ రూ.1,200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
నగరంలోని పలు చెరువుల పునరుద్దరణ పనులను హైడ్రా వేగంగా చేపడుతోంది. మరోవైపు ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షిస్తోంది. పార్కులు, రోడ్లు, ప్రజావసరాల కోసం లే అవుట్లలో కేటాయించిన స్థలాలను సైతం కబ్జా చెరల నుంచి విముక్తి కల్పిస్తోంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా సిబ్బంది వేగంగా స్పందిస్తుండటంతో ప్రజావాణిలో ఫిర్యాదులు సైతం పెరుగుతున్నాయి.