అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa | హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు ఆగడం లేదు. చెరువులు, బావులు పార్క్‌లు, ప్రభుత్వ స్థలాలను వేటిని అక్రమార్కులు వదలడం లేదు. కబ్జాలపై ప్రజలు హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు.
అక్రమార్కులు చెరువులతో పాటు నగరంలోని ఊట బావులను కూడా కబ్జా చేస్తున్నారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో (Hydraa Office) ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి అర్జీలు సమర్పించారు. కబ్జాలపై మొత్తం 32 ఫిర్యాదులు వచ్చాయి. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లోని వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్‌లో (Venrag Enclave) చారిత్రక ఊటబావిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయతిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న చింతబాయిని రక్షించాలని కోరారు. వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్ లే ఔట్ వేసినప్పుడు ఆ బావిని ఓపెన్ స్పేస్‌గా చూపించారని పేర్కొన్నారు.
Hydraa | పార్కులు నిర్మించాలి
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం ఆర్‌కే పురం డివిజన్‌లోని గ్రీన్‌హిల్స్ కాలనీలో 6087 గజాల ఓపెన్ స్పేస్ వదిలిపెట్టారు. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురైంది. దీంతో ఆ భూమిని కాపాడాలని స్థానికులు హైడ్రాను కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నిజాంపేట సర్కిల్ పరిధిలోని చిల్డ్రెన్ పార్కు దగ్గరలోని మురుగునీరు, వరదనీటి కాలువను ఇష్టానుసారం మార్చేస్తున్నారని.. గతంలో ఎలా ప్రవహించేదో అలాగే ఉంచాలని కౌశల్యా కాలనీ వాసులు వినతి పత్రం సమర్పించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను ఇష్టం వచ్చినట్లు మలుపు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని వెయ్యి గజాల భూమి కబ్జాకు గురైంది. దీనిని 250 గజాల చొప్పున నాలుగు ఫ్లాట్లుగా చేసి ఇంటి నంబర్లు కూడా తెచ్చుకున్నారని పేర్కొన్నారు.