అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa encroachment drive | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. మంగళవారం పలు ప్రాంతాల్లో కబ్జాలను తొలగించింది.
మేడ్చల్ – మల్కాజిగిరి (Medchal – Malkajgiri) జిల్లా అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల మేర కబ్జా అయింది. ఆ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎఫ్టీఎల్ (ftl) పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు. ఈ మేరకు మంగళవారం ఎఫ్టీఎల్ పరిధిలోని షెడ్లను తొలగించారు.
Hydraa encroachment drive | 1100 గజాల పార్కు స్థలాలను..
వనస్థలిపురం (Vanasthalipuram) సాహేబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1982లో 12 ఎకరాల్లో 161ప్లాట్లతో జక్కిడి కుటుంబ సభ్యలు లే ఔట్ వేశారు. ఇందులో 650 గజాలను పార్కు కోసం కేటాయించారు. అనంతరం ఆ పార్కు స్థలాన్ని సైతం ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఆ స్థలంలో ప్రహరీతో పాటు షెడ్లు నిర్మించారు. దీంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. అధికారులు పార్కు స్థలంలోని నిర్మాణాలను కూల్చి వేశారు. మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును సైతం ఆక్రమణల చెర నుంచి విడిపించారు. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని కొందరు ఆక్రమించారు. అక్కడ ప్రహరీతో రేకుల షెడ్డును నిర్మించగా.. అధికారులు తొలగించారు.